నిధులివ్వక.. బండి కదలక!
రైల్వే ప్రాజెక్టుల్లో కనపడని కనీస పురోగతి ● ప్రతి బడ్జెట్‌లో కృష్ణా జిల్లాకు తీరని అన్యాయం ● దశాబ్దాలుగా మాటలకే పరిమితమైన బందరు–రేపల్లె కొత్త లైను ● కలగా మిగిలిన మచిలీపట్నం– నరసాపురం నూతన మార్గం ● కొత్త ప్రాజెక్టుల ఊసే ఎత్తని వైనం ● నేడు విజయవాడ డివిజన్ ఎంపీలతో రైల్వే అధికారుల సమావేశం
సాక్షి, మచిలీపట్నం: రైల్వే బడ్జెట్.. ఏటా జిల్లా ప్రజలను ఊరించి నిరుత్సాహ పరుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, రైల్వే అధికారుల జోనల్ మీటింగ్‌లు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించే ప్రతిసారి ప్రజలు ఆశలు పెట్టుకుంటారు. జిల్లాకు కొత్త ప్రాజెక్టులు వస్తాయని, ఆ పనులు పూర్తయితే ప్రయాణ, రవాణా కష్టాలు తొలగిపోతాయని భావిస్తారు. కేంద్రం నుంచి ప్రకటనలు చేస్తారని, నిధులు కేటాయిస్తారని ఎదురు చూస్తారు. కానీ కేంద్రం మాత్రం ఊరించి ఉసూరుమనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. బ్రిటీష్ కాలం నుంచి ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం.. రైల్వే ప్రాజెక్టుల పురోగతిలో వెనకబడే ఉంది. కొత్త ప్రాజెక్టుల విషయంలో ప్రతిసారి అన్యాయం జరుగుతోంది. నూతన మార్గాలు, స్టేషన్ల ఆధునికీకరణ పనులతో పాటు రోడ్డు కమ్ రైల్వే లైన్ క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణం లాంటి అనేక పనుల నిధులు కావాల్సి ఉంది. వచ్చే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ విజయవాడ డివిజన్ పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రాజెక్టులు, డిమాండ్ల పరిష్కారానికి కావాల్సిన నిధులకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. 2025 చివరి నాటికి బందరు పోర్టు పూర్తయ్యే అవకాశం ఉండడంతో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ముఖ్యమైన డిమాండ్లు ఇవి..
● మచిలీపట్నం నుంచి రేపల్లెకు కొత్త రైలు మార్గం నిర్మించాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. సుమారు 45 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గం ఏర్పడితే ప్రయాణ, రవాణా సమస్యలు తొలిగిపోతాయి.
● బందరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి నూతన రైలు మార్గం నిర్మించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
● మచిలీపట్నం–గుడివాడ, ఇతర స్టేషన్ల డబ్లింగ్, ఆధునికీకరణ పనుల కోసం రూ.221కోట్లు కావాల్సి ఉంది.
● మచిలీపట్నం–గుడివాడ, విజయవాడ–గుడివాడ, భీమవరం–నరసాపురం, భీమవరం–నిడదవోలు స్టేషన్ల మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం ఒకే ప్రాజెక్టు కింద పనులు చేస్తున్నారు. ఈ పనులకు రూ.251 కోట్లు విడుదల చేయాలి.
● విజయవాడ, విశాఖపట్నం, గూడూరు, గుడివాడ, కాజీపేట మధ్య రోడ్ క్రాసింగ్స్ సమస్య నివారించేందుకు ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జీల నిర్మాణానికి గత బడ్జెట్‌లో రూ.15.53కోట్లు మాత్రమే ప్రకటించారు. దీనిపై సర్వే చేసి నిధులు కేటాయించాలి.
రోడ్డు, క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మాణం..
కృష్ణా జిల్లాలో 31 రోడ్డు, రైల్వే లైన్ల క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. మచిలీపట్నం పరిధిలో చిలకలపూడి, ప్యారల్‌నగర్, నవీన్‌మిట్టల్ కాలనీ రోడ్డు, గన్నవరంలో ముస్తాబాద, పురుషోత్తపట్నం, మర్లపాలెం, చిన్నఅవుటపల్లి, పెద్దఅవుటపల్లి, ఆత్కూరు తేలప్రోలు, అంపాపురం, వీరవల్లి, వెల్లేరు, పొట్టిపాడు, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, పెడన పట్టణంలోని మచిలీపట్నం ప్రధాన రహదారిలో, గూడూరు వెళ్లే మార్గంలో, నడుపూరు, గుడివాడలో పెద్దకాలువ గేటు, ఆర్టీసీ కాలనీ, మల్లయ్యపాలెం, గుడ్లవల్లేరు, పామర్రు రోడ్డులో, కంకిపాడు– ఉప్పలూరు మధ్య, తెన్నేరు వద్ద రైల్వే లైన్ రోడ్డు క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. ప్రధాన దారుల్లోని గేట్ల వద్ద ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. గేటు వేశాక సుమారు 20 నిముషాల నుంచి అరగంట సమయం పడుతోంది. వీటిని రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఫ్లై ఓవర్)లు, రోడ్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు నిర్మిస్తేనే సమస్య తొలగనుంది.
ప్రతిపాదనలు ఇచ్చాం..
రైల్వే ప్రాజెక్టులపై జీఎం సమావేశం నేపథ్యంలో పలు డిమాండ్లతో ప్రతిపాదనలు ఇచ్చాం. ఇప్పటికే రైల్వే మంత్రి, ఉన్నతాధికారులను కలిసి విన్నపాలు చేశాం. ముఖ్యంగా మచిలీపట్నం–రేపల్లె కొత్త రైలు మార్గంతో పాటు నరసాపురానికి నూతన లైను ఏర్పాటు చేయాలి. వీటితో పాటు మచిలీపట్నం నుంచి తిరుపతికి నేరుగా రైలు సౌకర్యం, రైల్వే లైన్, రోడ్డు క్రాసింగ్‌ల వద్ద వంతెనల నిర్మించాల్సిన అవసరం ఉంది. వీటిపై మరోసారి ప్రస్తావిస్తా.
– వల్లభనేని బాలశౌరి, ఎంపీ, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment