No Headline
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు స్నపనాభిషేకం జరిపించారు. నిత్య పూజల అనంతరం ఉదయం 8.40 గంటలకు తొలి దర్శనానికి అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో కేఎస్ రామరావులతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం రూ. 500 వీఐపీ క్యూలైన్‌తో పాటు రూ. 100, రూ.300, సర్వ దర్శనంలో భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.
అమ్మ ఆగమనం.. ఆనంద పరవశం
దుర్గమ్మ ఉత్సవ మూర్తికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆరో అంతస్తులో వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.
కుంకుమార్చనలు..
ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. సుమారు 78 మంది ఉభయదాతలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. 40 మంది అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ప్రత్యేక కుంకుమార్చన జరిగింది. దీనిలో భాగంగా అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది.
రూ. 4 కోట్ల విలువైన వజ్రాభరణాలు
దుర్గమ్మకు మహారాష్ట్రలోని పూణేకు చెందిన వ్యాపారవేత్త సౌరభ్ గౌర్ వజ్ర కిరీటాన్ని సమర్పించగా, హైదరాబాద్‌కు చెందిన సీఎం రాజేష్ సూర్య, చంద్ర ఆభరణాలు.. హెదరాబాద్‌కే చెందిన ఎమిరాల్డ్ ఫర్నిచర్‌కు చెందిన హైమావతి సూర్యకుమారి ముక్కెర, నత్తు, బుల్లాకిని సమర్పించారు. ఆశీర్వచన మండపంలో దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, డెప్యూటీ ఈవో రత్నరాజు, ఆలయ ఈవో రామరావు చేతుల మీదుగా అర్చకులకు అందజేశారు. భక్తులు సమర్పించిన వజ్రా భరణాల విలువ రూ.4 కోట్లకు పైగానే ఉంటుందని ఈవో పేర్కొన్నారు. శుక్రవారం గాయత్రీదేవి అలంకరణ సందర్భంగా దీనిని వినియోగిస్తామన్నారు.
సేవా కమిటీ తాలూకా అంటూ..
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం 56 మందితో కూడిన సేవా కమిటీని ఏర్పాటు చేసింది. పలువురు భక్తులు తాము ఫలానా కమిటీ సభ్యుడి తాలూకా అంటూ సెల్‌ఫోన్‌లో ఫొటోతో పాటు జిరాక్స్ కాపీలను చూపి దర్శనానికి పంపాలని సిబ్బందిౖపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో సిబ్బంది సేవా కమిటీ లేఖతో పాటు ఎమ్మెల్యేల లేఖలు తెచ్చుకున్న పలువురిని వీఐపీ క్యూలైన్‌లోకి అనుమతించారు.
శక్తి రూపం..
బాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
తొలి దర్శనం చేసుకున్న మంత్రులు, సీపీ, ఈవో నేడు గాయత్రీదేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులకు అనుమతి
Comments
Please login to add a commentAdd a comment