బందరుకు ‘సఫాయీమిత్ర సురక్ష’ అవార్డు | - | Sakshi
Sakshi News home page

బందరుకు ‘సఫాయీమిత్ర సురక్ష’ అవార్డు

Published Fri, Oct 4 2024 2:50 AM | Last Updated on Fri, Oct 4 2024 2:50 AM

బందరు

మచిలీపట్నంటౌన్‌: స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న మచిలీపట్నం నగరపాలక సంస్థకు సఫాయీ మిత్ర సురక్ష ప్రథమ స్థాయి అవార్డు దక్కింది. ఈ అవార్డుకు జ్ఞాపిక, ప్రశంస పత్రాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేశాయి. వీటిని నగర కమిషనర్‌ సీహెచ్‌వీవీఎస్‌ బాపిరాజు గురువారం జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీని కలిసి చూపించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను కమిషనర్‌ బాపిరాజు శాలువా కప్పి సత్కరించారు. నగరంలోని పారిశుద్ధ్య విభాగానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయటంతో నగరానికి ఈ అరుదైన గౌరవం దక్కిందని ఈ సందర్భంగా కలెక్టర్‌ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌ ఇన్‌చార్జులు నాగేశ్వరరావు, అశోక్‌, సచివాలయ కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ నుంచి

మూడు కొత్త సర్వీసులు

గుడివాడ టౌన్‌: గుడివాడ పట్టణ ప్రజల సౌకర్యార్థం గుడివాడ ఆర్టీసీ డిపో నుంచి మూడు కొత్త సర్వీసులు ప్రారంభించామని ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ అన్నారు. గురువారం స్థానిక ఆర్టీసీ డిపో నుంచి ఆయన సర్వీసులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి, హైదరాబాద్‌లకు సూపర్‌ లగ్జరీ బస్సులు విజయవాడకు పల్లె వెలుగు సర్వీస్‌లను ప్రారంభించామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ ఎ. వాణిశ్రీ, విజయవాడ జోన్‌ ఈడీ గోపీనాథ్‌రెడ్డి, గుడివాడ డిపో మేనేజర్‌ రాజేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించండి

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రజలకు ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే విధంగా కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకువచ్చి బయట నిల్వ చేసేందుకు ఎనిమిది స్టాక్‌ యార్డులను గుర్తించామన్నారు. ఒక్కొక్క స్టాక్‌ యార్డుకు ఇద్దరు చొప్పున షిఫ్ట్‌ పద్ధతిలో పోలీస్‌ సిబ్బందిని నియమించాలన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ప్రాధాన్య అంశమని నిర్మాణానికి అవసరమైన ఇసుకను సమకూర్చేందుకు ప్రత్యేక ఇసుక రీచ్‌లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ గీతాంజలిశర్మ, ఏఎస్పీ ప్రసాద్‌, మైనింగ్‌ ఏడీ కొండారెడ్డి, డీపీవో జె. అరుణ, ఇరిగేషన్‌ ఈఈ కృష్ణారావు, ఎంవీఐ ఎండీఎల్‌ సిద్దిఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రీడల అభివృద్ధికి

కృషి చేయండి

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. గురువారం ఆయన చాంబర్‌లో జిల్లా స్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డిస్ట్రిక్‌ స్పోర్ట్స్‌ అథారిటీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థల నుంచి జీవో నంబరు 84 ప్రకారం 3 శాతం స్పోర్ట్స్‌ సెస్‌ వసూలు చేసేలా చూడాలన్నారు. తద్వారా జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ రూపొందించి ఆయా క్రీడల్లో ఈవెంట్స్‌ నిర్వహించాలన్నారు. కమిటీ కన్వీనర్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె. ఝాన్సీలక్ష్మి, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్‌ బాపిరాజు, డివిజనల్‌ పంచాయతీ అధికారి కార్యాలయ ఏవో సీతారామయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బందరుకు ‘సఫాయీమిత్ర సురక్ష’ అవార్డు 1
1/2

బందరుకు ‘సఫాయీమిత్ర సురక్ష’ అవార్డు

బందరుకు ‘సఫాయీమిత్ర సురక్ష’ అవార్డు 2
2/2

బందరుకు ‘సఫాయీమిత్ర సురక్ష’ అవార్డు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement