కూటమిలో ‘కమిటీ’ కుంపటి!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఉత్సవ కమిటీని ప్రకటించింది. ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ఈ కమిటీకి సంబంధించిన ఉత్వర్వులను జారీ చేసింది. సేవా కమిటీ పేరుతో దసరా ఉత్సవాలు కొనసాగే వరకూ ఉండే విధంగా ప్రభుత్వం 56 మందితో భారీ కమిటీని ప్రకటించింది.
మొదలైన రగడ..
గురువారం ఉదయం ఉత్సవ కమిటీలో ఉన్న పేర్లను చూసి కూటమిలో రగడ మొదలైంది. పేర్లు చూడగానే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. పార్టీ పెద్దలకు ఫోన్లు చేసి తమ నిరసనను తెలిపారు. ఆలయ చరిత్రలో లేని విధంగా దసరా ఉత్సవాలకు 56 మందితో ఉత్సవ కమిటీ వేయటంపై భక్తులు సైతం విస్తుపోతున్నారు. ఆలయానికి ప్రస్తుతం పాలకవర్గం రద్దు కాలేదు. ఆ కమిటీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా 56 మందితో ఉత్సవ కమిటీ వేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రౌడీషీటర్లకు కమిటీలో చోటు..
కూటమి పార్టీల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు రౌడీషీటర్లు సైతం ఈ ఉత్సవ కమిటీలో ఉన్నట్లు తెలిసింది. పవిత్రమైన ఉత్సవాలు జరిగే ఆలయంలో రౌడీషీటర్లకు చోటు కల్పించటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దసరా ఉత్సవాల్లో కొండపై హడావుడి చేయటానికి, దర్శనాల పేరు తో హల్‌చల్ చేయటానికే ఇంత పెద్ద సంఖ్యలో నాయకులను కమిటీలుగా వేశారంటూ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురిపై అనేక నేరాలకు సంబంధించిన కేసులు సైతం ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
జెండా మోసినోడికి మొండిచెయ్యి..
ఉత్సవ కమిటీలో స్థానం ఆశించిన నాయకులు తమ పేర్లు కనపడకపోయే సరికి వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా పార్టీ పెద్దలను విమర్శిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ‘తెలుగుదేశం పార్టీ జెండా మోసినోడికి నోట్లో మట్టి కొడుతున్నారు. నిన్నకాక మొన్న పార్టీలో చేరిన వారికి ఏ విధంగా పదవులు ఇస్తారు...? పార్టీలో దీర్ఘకాలికంగా సభ్యత్వం ఉన్న వారిని గుర్తించటం లేదు. కార్యక్రమాలకు జనాలను తోలుకురావాలి, ఎవరినీ ప్రకటిస్తే వారిని గెలిపించాలి, పెద్దపెద్ద బ్యానర్లు కట్టాలి. ఇలాంటి సమయంలో కొత్తవాళ్లకు పదవులిస్తారా?’ అంటూ వారి పోస్టుల్లో పార్టీని నాయకులు ప్రశ్నించారు. ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల బీజేపీలో చేరినవారికి ఈ కమిటీలో చోటు కల్పించారు. టీడీపీకి చెందిన నాగుల్‌మీరా, బుద్దా వెంకన్న వర్గాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవటంపై పార్టీలో చర్చ జరగుతోంది.
ఇంద్రకీలాద్రిపై వింత పోకడలు దసరాకు 56మందితో ఉత్సవ కమిటీ ప్రకటన పాలకవర్గం ఉన్నా కొత్త కమిటీ నియామకంపై సర్వత్రా విమర్శలు కమిటీలో నాగుల్‌మీరా, బుద్దా వెంకన్న వర్గాలకు మొండిచెయ్యి సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతల పోస్టింగులు
తప్పుల తడకగా ఉత్తర్వులు
ప్రభుత్వ సేవా కమిటీగా ప్రకటించిన ఉత్సవ కమిటీ ప్రకటనలో అన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. కొంతమంది ఇంటి పేర్లు కూడా ఇవ్వకుండా కమిటీలో ప్రకటించారు. మరొకరి పేరు సగం మాత్రమే రాశారు. అదేవిధంగా పేర్లులో చాలా తప్పులు ఉండటంతో ఆ నాయకులు సైతం మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment