రైల్లో నుంచి కాలువలోకి దూకిన మహిళ
కృష్ణలంక(విజయవాడతూర్పు): మానసిక స్థితి సరిగ్గా లేని ఓ మహిళ రైల్లో నుంచి బందరు కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కట్టవ గ్రామానికి చెందిన షేక్ ఖాదర్‌వలి, షేక్ జిన్నాతున్నీసా భార్యాభర్తలు. ఖాదర్‌వలి కూలీ పనులు చేస్తుంటాడు. గత 20 ఏళ్లుగా జిన్నాతున్నీసాకు మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆమె విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 20 రోజుల క్రితం ఆమె నిజాంపట్నంలోని పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సమీపంలోని రైల్వేస్టేషన్‌కు చేరుకుని విజయవాడ వెళ్లే రైలు ఎక్కింది. రాత్రి 9 గంటల సమయంలో ఆ రైలు కృష్ణానది దాటి బందరు కాలువ మీదకు వెళ్లగానే ఆమె కాలువలో దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ కాలువ ఒడ్డున ఉన్న చెట్టు తీగలను పట్టుకుని నీటిలో ఉండిపోయింది. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో కాలువలో నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు నీటిలో ఉన్న ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పీఎస్ కానిస్టేబుళ్లు వి.నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ స్థానికులతో కలిసి నీటిలో ఉన్న ఆమెకు కొబ్బరి మట్టను అందించి పైకి లాగి ఒడ్డుకు చేర్చారు. వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఆమెను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించి మహిళ ప్రాణం కాపాడిన సిబ్బంది నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్‌లను సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారు.
రాత్రి నుంచి ఉదయం వరకు చెట్టు తీగలను పట్టుకుని నీటిలోనే ఆమెను కాపాడిన కృష్ణలంక పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment