ఉయ్యూరు(పెనమలూరు): లోపభూయిష్ట ఉచిత ఇసుక విధానంతో నష్టపోతున్నామని టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రావూరి వీరాస్వామి రాజా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. కమిటీ గౌరవ అధ్యక్షుడు రావూరి మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా టిప్పర్ల యజమానులకు కష్టాలు తప్ప లాభం లేదన్నారు. ఉచిత ఇసుక సక్రమంగా అమలుచేయకపోవటంతో టిప్పర్ల యజమానులు, వినియోగదారులకూ నష్టం జరుగుతోందన్నారు. లారీ ఇసుక ధర రూ.20 వేల నుంచి రూ.25 వేలు పలుకుతోందన్నారు. ఉచిత ఇసుక విధానంతో రూ.12 వేలకు అందాల్సిన టిప్పరు ఇసుక ధర పెరగటానికి గల కారణాలు ఏంటన్నది ఆలోచించాలన్నారు. ప్రైవేటు ఏజెన్సీలు, క్వారీ నిర్వాహకుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. క్వారీల నుంచి ఇసుక తీసుకువెళ్తున్నా రవాణా శాఖ అధికారులు, మైనింగ్ శాఖ అధికారులు కేసులు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానం ఉన్నప్పుడు పర్మిట్లు, మైనింగ్ బిల్లులు ఎక్కడ ఉంటాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్‌లను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకున్నా అవకాశం కల్పించలేదన్నారు. ప్రభుత్వం ‘ఇసుక’పై ప్రజలకు మేలు జరిగే విధానాన్ని తీసుకురావాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇ.నరేంద్ర, ఉపాధ్యక్షులు మురళీమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
టిప్పర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ
Comments
Please login to add a commentAdd a comment