కలెక్టరేట్‌లో మరమ్మతులను పూర్తి చేయాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో గురువారం మరమ్మతులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కలెక్టరేట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తయినప్పటికీ వాటికి రంగులతో పాటు చిన్న, చిన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రహరీ బయట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, వర్షపునీరు కలెక్టరేట్ నుంచి బయటకు వెళ్లేందుకు మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
జిల్లా ఖనిజాల ట్రస్ట్ నుంచి చెల్లింపులు
కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి చెల్లింపు – వినియోగం పద్ధతిలో నిర్వహించాలన్నారు. ఖజానా స్ట్రాంగ్‌రూమ్ పైకప్పు పనులు సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. వర్షం కురిసినప్పుడు కలెక్టరేట్ పైకప్పు నుంచి నీరు కారకుండా ఏర్పాటు చేసేందుకు అంచనాలు రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను జిల్లా ఖనిజాల ట్రస్ట్ నిధుల నుంచి చెల్లింపులు చేయాలన్నారు. ఎన్నికల విభాగం పైభాగాన, కలెక్టర్ చాంబర్ ఎదురుగా ఏర్పాటు చేసిన టైల్స్ పరిస్థితిపై నివేదిక అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఎంయూడీఏ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్‌గౌడ్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈడీ కృష్ణారాయన్, కలెక్టరేట్ ఏఓ సీహెచ్ వీరాంజనేయప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment