విచ్చలవిడి.. ఇసుక దోపిడీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో 15, కృష్ణాజిల్లాలో ఎనిమిది ఇసుక రీచ్‌లకు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. యంత్రాలతో కాకుండా కూలీలతోనే ఇసుక తవ్వకాలు చేపట్టాలి. కూలీలతో ఇసుక తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం గరిష్టంగా టన్నుకు రూ.120 ధర నిర్ణయించింది. అయితే కాంట్రాక్టర్లు ఇసుక రీచ్ తమ అధీనంలో ఉంటే చాలు అక్రమంగా ఇసుక రవాణాచేసి భారీఎత్తున దండుకోవచ్చన్న భావనతో ఎన్టీఆర్ జిల్లాలో టన్నుకు గరిష్టంగా రూ.80, కృష్ణాజిల్లాలో అతి తక్కువగా టన్నుకు కేవలం రూ.19కే కోట్ చేసి, ఇసుక లోడింగ్ టెండర్లను దక్కించుకొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పెండ్యాల, కొక్కునూరు, అనుమంచిపల్లి, శనగపాడు రీచ్‌లో ఇసుక తవ్వకాలు ప్రారంభంకాగా, ఇక్కడ కూలీలతో ఇసుక లోడింగ్ చేయించడం లేదు. హైదారాబాద్‌తోపాటు తెలంగాణ లో ఈ ప్రాంత ఇసుకకు డిమాండ్ ఉండటంతో రీచ్‌లనుంచే నేరుగా హైదరాబాద్‌కు ఇసుకను తరలించి భారీగా దండుకొంటున్నారు. ఇసుక అక్రమరవాణాలో నేరుగా ప్రజాప్రతినిధుల హస్తం ఉండటంతో అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
బాబు మాటలకు అర్థాలే వేరులే..
ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలను కాంట్రాక్టర్లు పెడచెవిన పెడుతున్నారు. బాబు మాటలకు ఆర్థాలే వేరులే అని ప్రజాప్రతినిధులే బహిరంగంగా పేర్కొంటుండటం అనుమానాలకు తావిస్తోంది. రీచ్‌లు, స్టాక్ పాయింట్లలోని కెమెరాలు అలంకారప్రాయంగా మారగా, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ అదికూడా మాటలకే పరిమితమైంది. మున్నేరు, తిరువూరు ప్రాంతాల నుంచి ఇసుక నిత్యం తెలంగాణకు తరలివెళ్తూనే ఉంది.
పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా...
కృష్ణాజిల్లాలో ఎనిమిది రీచ్‌లలో తవ్వకాలకు అనుమతి ఇవ్వగా, రీచ్‌లలో నీరు ఉండటంతో ఇప్పటివరకు శ్రీకాకుళం ఇసుక రీచ్ మాత్రమే ప్రారంభమైంది. ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, చోడవరం ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.
చోడవరంలో రోజుకు 170 ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పుల ఇసుక బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతుంది. టీడీపీ నేతలు మూడు ర్యాంప్‌లు ఏర్పాటు చేసి, రోజుకు రూ.2 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు తుంగలో తొక్కుతున్నారు. టీడీపీ నేతలు ట్రాక్టర్ డ్రైవర్లపై దాడులు చేయగా బాఽధితుల నుంచి ఫిర్యాదులు అందినా పోలీసులు దగ్గర ఉండి రాజీచేసి పంపారు.
అవనిగడ్డలో ఆగని దందా...
అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం శ్రీకాకుళంలో రెండుచోట్ల ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతివ్వగా మూడు రోజుల క్రితమే తవ్వకాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. సహజ వనరులను దోచుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని అలాంటివారు మాపార్టీ వారైనా వారిపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వేదికల మీద చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా రాత్రివేళలో సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్న దివిసీమలోని సాగునీటిని ప్రధాన ఆధారమైన పులిగడ్డ అక్విడెక్టుకు కూతవేటు దూరంలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల వరకూ కృష్ణానదికి ఆనుకుని ఉన్న ప్రతిగ్రామంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చల్లపల్లి మండలం నిమ్మగడ్డ, వెలివోలు, ఆముదార్లంక, ఘంటసాల మండలం పాపవినాశనం మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, పెదకళ్ళేపల్లి, నాగాయతిప్ప, అవనిగడ్డ మండలం పులిగడ్డ, దక్షిణ చిరువోలులంక, కోడూరు మండలం విశ్వనాధపల్లి, కుమ్మరిపాలెం, నాగాయలంక మండలం టి.కొత్తపాలెం, నాగాయలంక, మనుషులతో కాకుండా ప్రొక్లెయిన్ల ద్వారా ట్రాక్టర్లలోకి లోడు చేసుకుని తరలించేస్తున్నారు. చల్లపల్లి మండలంలో ఇసుక అక్రమరవాణాని అడ్డుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, జర్నలిస్ట్‌లపై అక్రమ ఇసుకదందా చేస్తున్న వారు దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం భయపడిపోతుండటం గమనార్హం.
రీచ్‌ల నుంచే యథేచ్ఛగా తెలంగాణకు తరలుతున్న ఇసుక
సీసీ కెమెరాలు, డ్రోన్‌లు నామమాత్రమే యంత్రాలతో సాగుతున్న ఇసుక తవ్వకాలు .. కూలీలకు లభించని ఉపాధి అనుమతులు లేనిచోట కూడా తవ్వకాలు కొరవడిన అధికారుల పర్యవేక్షణ
పామర్రులో అడిగేవారేరి...!
పామర్రు నియోజకవర్గంలోని భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, కళ్లావారిపాలెం తదితర ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఒక్కొక్క ప్రాంతనుంచి రోజుకు 400 ట్రాక్టర్లకుపైగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడ ర్యాంపు పేరుతో తెలుగుతమ్ముళ్లు ట్రాక్టరుకు రూ.200 ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అనుమతి లేకున్నా నదిలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment