రెండో విడత బ్రూసెల్లా వ్యాధి నిరోధక టీకాలు
చిలకలపూడి(మచిలీపట్నం): పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడత బ్రూసెల్లా వ్యాధి నిరోధక టీకాలను పశువుల యజమానులు తమ పశువులకు తప్పనిసరిగా వేయించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ చెప్పారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో బ్రూసెల్లా వ్యాధి నిరోధక టీకాల అవగాహనపై ముద్రించిన వాల్‌పోస్టర్లను గురువారం ఆమె చాంబర్‌లో ఆవిష్కరించారు. జేసీ మాట్లాడుతూ.. బ్రూసెల్లా అబర్టీస్ అనే సూక్ష్మజీవి వల్ల గేదెలు, ఆవుల్లో వ్యాపించి గర్భస్రావం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి గర్భస్రావాల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే జనటిక్ వ్యాధి అని, ఈ వ్యాధిని నిరోధించేందుకు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల వయసున్న పెయ్యదూడలకు ఈ టీకాను వేయాలన్నారు. బ్రూసెల్లా ముఖ్యమైన వ్యాధి కావటంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ పశువ్యాధి నిరోధక పథకం(ఎన్‌ఏడీసీపీ) ద్వారా సామూహిక టీకా కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. పశుసంవర్ధకశాఖ సిబ్బంది ప్రతి గ్రామంలో టీకాలు మూడు దఫాలుగా వేస్తారన్నారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు 9 వేల పెయ్యదూడలకు ఈ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎన్‌సీహెచ్ నరసింహులు, డీఎస్‌వో వి.పార్వతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డి.సృజన, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment