ఇంజినీరింగ్ పనులపై సమీక్షలో కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): పంచాయతీ రాజ్, ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగన్‌వాడీ టాయిలెట్ల పనులను వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ వద్దని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. సంక్రాంతి పండుగలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్‌లోని మీ–కోసం హాల్‌లో పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల ఇంజినీ రింగ్ అధికారులతో కలెక్టర్ మంగళవారం సమావేశమయ్యారు. ఆయా శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను నియోజకవర్గాలు, మండల వారీగా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జల జీవన్ మిషన్, ఉపాధి హామీ, సీఎస్‌ఆర్ పథకాల కింద చేపట్టే పనులకు నిధుల కొరత లేదన్నారు. గత వారానికి జరిగిన పనుల పురోగతి కలెక్టర్ సమీక్షిస్తూ నూరు శాతం గ్రౌండింగ్ జరగాలన్నారు. పంచాయతీ రాజ్‌లో గుడివాడ, గన్నవరం సబ్‌డివిజన్లలో పనుల పురోగతి ఆశాజన కంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపై గుంతలను పూడ్చే పనులు వేగవంతం చేయాలని కోరారు. కొత్త పనుల అనుమతుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. టెండర్ ప్రక్రియలో ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసి పనులు ప్రారంభించాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ చేపట్టిన అంగన్‌వాడీల్లో టాయిలెట్ల నిర్మాణ పనులు గ్రౌండింగ్ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేసేందుకు గ్రావెల్ సమస్య ఉందని అధికారులు తెలుపగా కలెక్టర్ స్పందించి పరిష్కరిస్తామన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో కృత్తివెన్నులో రెండు కమ్యూనిటీహాళ్ల నిర్మాణం మొదలు పెట్టాలని, సంక్షేమ హాస్టళ్ల మరమ్మతు పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన పనులు వర్క్ ఆర్డర్స్ పెండింగ్‌లో ఉంచవద్దని, వచ్చే వారానికి పనుల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని, పనులు కచ్చితంగా రికార్డు చేసి సకాలంలో బిల్లులు అప్‌లోడ్ చేసి, కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రమణరావు, డ్వామా పీడీ శివప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నటరాజ్, ఏపీఎస్‌డబ్ల్యూఐడీసీ ఈఈ రాయన్న, సీపీఓ గణేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment