ఇందిరాగాంధీ స్టేడియంలో పుస్తక మహోత్సవం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండో తేదీ నుంచి జరిగే 35వ విజయవాడ పుస్తక మహోత్సవం నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి టి.మనోహర్‌నాయుడు తెలిపారు. పుస్తక మహోత్సవం తొలుత పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తామని ప్రకటించామని, కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారంతో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉత్సాహంగా
‘ఫిట్ ఇండియా వాక్’
కోనేరుసెంటర్: ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో అందరం భాగస్వామ్యం కావాలని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఫిట్ ఇండియా వారోత్సవాలలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఫిట్ ఇండియా వాక్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి యువత ఆయువుపట్టు అని, యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం వాక్ థాన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె. శోభన్ బాబు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన ఆచార్యులు ఆచార్య ఎన్. ఉష, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త ఎం. శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వారికి భక్తులు హుండీల ద్వారా రూ. 3.68 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. భక్తులు ఆది దంపతులకు సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 21 రోజులకు గాను 45 హుండీల ద్వారా రూ. 3,68,90,834 నగదుతో పాటు 560 గ్రాముల బంగారం, 9.030 కిలోల వెండి లభించింది. ఇక యూఎస్‌ఏకి చెందిన 519 డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్లు 80, కత్తార్ రియాల్ప్ 204, మలేషియా 516 రింగేట్లు, ఒమాన్ బైంసాలు 1700, సింగపూర్ డాలర్లు 916 లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇక ఆన్‌లైన్ ద్వారా రూ. 1, 16, 429 లభించినట్లు పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఆలయ ఈవో కేఎస్ రామరావు, డీఈవో రత్నరాజులతో పాటు ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
డ్వాక్రా సభ్యులకు ఉచిత బయోగ్యాస్ యూనిట్లు
పెనమలూరు: పొదుపు సంఘాలకు ఉచిత బయోగ్యాస్ యూనిట్లు అందజేస్తామని సొసైటీ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (ఎస్‌ఈఆర్‌పీ) సీఈవో జి.వీరపాండ్యన్ తెలిపారు. ఆయన బుధవారం పెనమలూరు గ్రామంలో వినీల పొదుపు సంఘ సభ్యురాలు మొర్ల శివకోటికి ప్రభుత్వం రూ.40 వేలతో ఇచ్చిన బయోగ్యాస్ యూనిట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ యూనిట్‌లో 400 కేజీల పేడను, 400 లీటర్ల నీటిని టబ్బులో కలపాలన్నారు. 20 రోజులకు ఎల్‌పీజీ గ్యాస్ తయారవుతుందని వివరించారు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులకు పశుసంపద నుంచి వచ్చే పేడ ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుందన్నారు. భవిష్యత్తులో పలు సంఘాలకు ఈ బయోగ్యాస్ యూనిట్లు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కె.కన్నంనాయుడు, ఎంపీడీవో బి.ప్రణవి, ఏపీఎం జి.కృష్ణంరాజు, సీసీ నాగరత్నం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment