కార్పొరేట్‌కు దీటుగా సివిల్స్ శిక్షణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): కార్పొరేట్ స్టడీ సర్కిళ్లకు దీటుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో బీసీ సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 600 మంది అభ్యర్థులు అర్హత పరీక్ష రాయగా వారిలో 100 మంది ఉచిత సివిల్స్ శిక్షణకు ఎంపికయ్యారని తెలిపారు. శిక్షణలో ఒక్కో అభ్యర్థికి రూ.2లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఇక్కడ స్టడీ సర్కిల్ కొనసాగుతుందని, త్వరలో అమరావతిలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ సివిల్స్ కష్టమే అయినా అసాధ్యం కాదన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్‌కు ప్రాక్టీస్ చేయాలని అభ్యర్థులకు సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ పోలా భాస్కర్, డైరెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున, జిల్లా అధికారి కె. శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, బీసీ కార్పొరేషన్ జేఎండీ తనూజ రాణి, లా ఎక్సలెన్సీ ఐఏఎస్ అకాడమీ ఎండీ డీవీ రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
Comments
Please login to add a commentAdd a comment