దీక్షతో విరమణ మహోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శరణు.. శరణు.. భవానీ శరణు.. జై భవానీ.. జైజై దుర్గాభవానీ.. అంటూ సాగిన జగజ్జనని నామస్మరణతో ఇంద్రకీలాద్రికి పరవశించింది. దుర్గ అన్న నామస్మరణతోనే సర్వ దుర్గతులను తొలగించే దుర్గమ్మ దీక్షలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు సుప్రభాత సేవ, నిత్య పూజల అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ఆలయ అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అగ్నిహోత్రంతో హోమగుండాలకు చేరుకున్నారు. గోశాల వద్ద ఏర్పాటు చేసిన హోమగుండాల్లో అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు, డీఈఓ రత్నరాజు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్‌లో వేచి ఉన్న భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భవానీ మాలధారులు కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. మహామండపం వద్దకు చేరుకున్న భవానీలు తలపై ధరించిన ఇరుముడులను గురు భవానీల చేతుల మీదగా అమ్మవారికి సమర్పించడంతో పాటు మాల విరమణ చేశారు. హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు, ఆ సమీపంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో నీటి కొబ్బరి కాయలు సమర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి సీతమ్మ వారి పాదాల వద్దకు చేరుకుని తలనీలాలను సమర్పించారు.
అమ్మసేవలో 30 వేల మంది భవానీలు
దీక్ష విరమణను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్న భవానీలు తెల్లవారుజామున పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం వినాయకుడి గుడి నుంచి క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఇరుముడులను సమర్పించి, నేతి కొబ్బరి కాయను హోమగుండాలలో అర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకున్నారు. దీక్ష విరమణలకు తొలి రోజు భవానీ రద్దీ నామమాత్రంగా ఉండగా, సాదారణ భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తొలి రోజు సాయంత్రానికి 30 వేల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్షలను విరమించారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
యాగశాలలో శతచండీయాగం
భవానీ దీక్ష విరమణలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని యాగశాలలో శత చండీ యాగాన్ని ప్రారంభించారు. తొలుత గణపతి పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు, వేద మంత్రోచారణ మధ్య శత చండీయాగాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాలలో ఆలయ ఈఓ రామరావు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు యాగాన్ని నిర్వహిస్తామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
13 వేల మందికి..
దీక్ష విరమణలకు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భవానీలకు దేవస్థానం అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భవానీలకు ఆలయ ప్రాంగణంలో అడుగడున మంచినీటిని సరఫరా చేస్తుండగా, దర్శనం పూర్తయి, ఇరుముడులను సమర్పించిన పిమ్మట మహా మండపం ఎదుటి షెడ్డులో అల్పాహారం, అన్న ప్రసాద వితరణ చేపట్టింది. తొలి రోజు 13 వేల మందికి దేవస్థానం అల్పాహారం, భోజనాలు అందజేసింది.
భవానీలకు సకల సదుపాయాలు
దీక్ష విరమణలకు విచ్చేసే భవానీలకు అవసరమైన అన్ని సదుపాయాలను దేవస్థానం కల్పిస్తోందని ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు తెలిపారు. దీక్ష విరమణ ప్రారంభమైన వెంటనే మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్ వద్ద ఏర్పాట్లను ఈఓ రామరావు పరిశీలించారు.
శరణు...శరణు...భవానీ
భవానీ దీక్షల విరమణ ప్రారంభం ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న మాలధారులు అగ్నిప్రతిష్టాపనతో ప్రారంభమైన విరమణలు తొలి రోజు భవానీల రద్దీ నామమాత్రమే
Comments
Please login to add a commentAdd a comment