కృష్ణా డీఎంహెచ్‌ఓగా శర్మిష్ఠ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జి.గీతాబాయి శని వారం బదిలీ అయ్యారు. ఆమె విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఏలూరు జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.శర్మిష్ఠను నియమించారు.
కృష్ణా డీసీ కమిటీ చైర్మన్‌గా దేవనబోయిన
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా కోడూరు డీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్‌చైర్మన్‌గా నిడుమోలు డీసీ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవనబోయిన వెంకటేశ్వరరావు, వల్లూరుపల్లి గణేష్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సత్కరించారు. కృష్ణా డెల్టాలో రైతులకు విశిష్ట సేవలు అందించాలని వారికి సూచించారు. తొలుత డీసీ చైర్మన్, వైస్‌చైర్మన్లను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాము పరిశీలన
చిలకలపూడి(మచిలీపట్నం): ఈవీఎం గోదాముల వద్ద 24 గంటలూ పూర్తిస్థాయి బందో బస్తు నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఆయన కృష్ణా జిల్లా కలెక్టరేట్ లోని ఈవీఎం గోదామును శనివారం పరిశీలించారు. సీసీ కెమెరాలు, సర్వైలెన్స్ రూమ్‌ను తనిఖీ చేశారు. అక్కడి రిజిస్టర్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, కలెక్టర్ డి.కె.బాలాజీ సంతకం చేసిన అనంతరం గోదాము తాళాలు తెరిచి ఈవీఎం, వీవీ ప్యాట్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీఓ కె.స్వాతి, మార్కెటింగ్ ఏడీ ఎల్.నిత్యానందం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అనుక్షణం అప్రమత్తం
లబ్బీపేట(విజయవాడతూర్పు): భవానీ దీక్షల విరమణ సందర్భంగా వైద్య శిబిరాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ఆమె శనివారం సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన ఆరు పడకల శిబిరాన్ని పరిశీలించారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు దీక్ష విరమణ సందర్భంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో 27 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో 24 గంటలూ మూడు షిఫ్టుల్లో 470 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, 108 వాహనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. దీక్ష విరమణకు వచ్చిన వారికి అనారోగ్య పరిస్థితులు తలెత్తితే వెంటనే దగ్గర్లోని వైద్య శిబిరంలో సేవలు పొందొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిడిమిక్ విభాగం హెల్త్ ఆఫీసర్ ఐ.రామకృష్ణ తదిత రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment