వృద్ధులు తరతరాల వారధులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వృద్ధులు తరతరాల వారధులు అని... వారిని గౌరవించుకోవడం అందరి బాధ్యత అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రజతోత్సవ సభ విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.నారాయణమూర్తి మాట్లాడుతూ వృద్థుల సంక్షేమం కోసం రాష్ట్రంలో కుటుంబపోషణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అసోసియేషన్‌కు అమరావతి పరిధిలో స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వేమూరు బాబూరావు, కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణించే సమయంలో సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే రాయితీలను కోవిడ్ తర్వాత రద్దు చేశారని, ఆ రాయితీలను పునరద్ధరించాలన్నారు.ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై రజతోత్సవ సావనీర్‌ను ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రముఖ వైద్యులు సమరం, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీఎల్. వెంకట్రావ్, కార్పోరేటర్ ఉషారాణి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా సహాయ సంచాలకుడు కామరాజు పాల్గొన్నారు. తొలుత స్వతంత్రభారతి సంస్థ ఆధ్వర్యంలో దేశప్రతిష్టను తెలియజేసేలా చేసిన సంప్రదాయ నృత్యాలు, విభిన్న ప్రతిభావంతులు సినిమా పాటలకు చేసిన నృత్యాలు, గాయకులు ఆర్.పిచ్చయ్య, చంద్రానాయక్ ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రజతోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్‌కు నేత్ర, దంత, వినికిడి విభాగాల ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. అనంతరం సినియర్ సిటిజన్స్‌ను సత్కరించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి అధికసంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment