తీవ్ర అల్పపీడనంతో ఉమ్మడి జిల్లాలో వర్షాలు
విజయవాడ పటమటలోని సెయింట్ పాల్స్ కెథడ్రల్ చర్చిలో బాల ఏసుకు పూజలు చేస్తున్న బిషప్ తెలగతోటి రాజారావు, ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులు, కొవ్వొత్తులు వెలిగిస్తూ..
ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. ఏసుక్రీస్తు జననాన్ని స్వాగతిస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రార్థనామందిరాలు సరికొత్తగా కాంతులీనాయి. క్రిస్మస్ ట్రీలు, స్టార్లు, క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా పశువుల పాక సెట్టింగులతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. క్రీస్తు జననాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతూ సాగిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
ఏడు ఎకరాలు పొలం కౌలుకు సాగుచేస్తున్నా. నాలుగు రోజుల క్రితం కూలీలతో ఎకరంలో కోత కోయించాను. సోమ వారం పనలను తిప్పుదామనుకున్నా. ఇంతలోనే వర్షం వచ్చింది. కొన్ని చోట్ల పనలు నీటమునిగాయి. తడచిన పనలు ఎంత ఆరబెట్టి కుప్పలు వేసినా ధాన్యం ముక్కిపోతుంది. వర్షాలు కొనసాగితే పనలపైనే ధాన్యం మెలకెత్తుతుంది.
– ఆరిగ చినబాబూరావు,
ఉల్లిపాలెం, కోడూరు మండలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులను ముసురు ముప్పు ఆందోళనకు గురిచేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటను కాపాడుకొనేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో కృష్ణా జిల్లాలో 1,51,718 హెక్టార్లలో వరి సాగైంది. ఇప్పటికే 98,631 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల వరి పంట పనలపై ఉంది. వర్షాలు కొనసాగితే పనలు నీటమునిగి ధాన్యం మొలకెత్తుతుందని రైతులు ఆందో ళన చెందుతున్నారు. జిల్లాలోని అవనిగడ్డ, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గా ల్లోని పలు మండలాల్లో ప్రస్తుతం జోరుగా వరికోతలు సాగుతున్నాయి. ముసురు వల్ల రైతులు వరి కోతలను వాయిదా వేశారు.
దళారుల దందా
కల్లాల్లో ఉన్న ధాన్యం నిల్వలు వర్షాలకు తడుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బెంబేలెత్తుతున్నారు. ఇదే అదనుగా దళారులు తేమశాతం సాకుగా చూపి రైతులను నిలుపుదోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్తా ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,720 దక్కాల్సిండగా, దళారులు కేవలం రూ.1300, రూ.1400 కే అడుగుతున్నారు. ఒక వేళ రైతు కష్టపడి ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లినా సేవా కేంద్రంలో తేమ శాతం, మిల్లులో తేమ శాతం మధ్య వ్యత్యాసం వస్తోంది. తేమ శాతం ఎక్కువగా ఉన్నందున ఆరబెట్టి మళ్లీ తీసుకురావాలని మిల్లర్లు సూచిస్తున్నారు. ధాన్యం తూకంలోనూ తేడాలు వస్తున్నాయి. వర్షం భయం వెంటాడుతుండటంతో రైతులు చేసేదేమీ లేక దళారులు అడిగిన ధరకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. క్వింటాకు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 39,877 మంది రైతుల నుంచి 3,42,184 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 35,416 హెక్టార్లలో వరి సాగవగా, 27,918 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు 10,910 మంది రైతుల నుంచి 75,791 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
మినుము సాగు ఆలస్యం
తేలియాడుతున్న మినుము గింజలు
కోడూరు తదితర మండలాల్లో యంత్రాలతో వరి కోతలు చేపట్టిన పొలాల్లో నాలుగు రోజుల క్రితం చల్లిన మినుము విత్తనాలు వర్షాలకు నీటిలో తేలియాడుతున్నాయి. మొలకలు తిరగబడటం వల్ల విత్తనాలు కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు పడితే మినుము విత్తనాలు చాలావరకు తిరగబడి మొలకెత్తవని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో పంట మినుముపై ఆశలు పెట్టుకుని సాగుచేస్తున్న కౌలు రైతులు మారిన వాతావరణ పరిస్థితులు చూసి మరింత కలవర పడుతున్నారు. మినుము పంట సాగు ఆలస్యమయితే దిగుబడులపైన తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు.
కల్లాల్లో, పనాలపైన ఉన్న ధాన్యం
దాన్యం కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం
వరికోతలు వాయిదా వేసిన రైతులు
రెండో పంట మినుము సాగు ఆలస్యం
ఆందోళన చెందుతున్న రైతులు
వరిపంట కోతకు వచ్చింది. మిషన్లతో కోయిద్దామ నుకునే సరికి ముసురు పట్టింది. ధాన్యం తడుస్తుందని కోతలను ఆపేశాను. వర్షం వల్ల పొలాల్లో నీరు నిలబడింది మిషన్లతో కోయించాలంటే నేల ఆరాలి. ఇందుకు మరో పదిరోజులు పడుతుంది. దీనివల్ల మినుముసాగు పదిహేను రోజులు ఆలస్యమవుతుంది. ఆ ఆలస్యం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
– పోలాబత్తిన వెంకటేశ్వరరావు,
పిట్టల్లంక, కోడూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment