మిచాంగ్‌ పరిహారానికి నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

మిచాంగ్‌ పరిహారానికి నిరీక్షణ

Published Sat, Jan 4 2025 7:54 AM | Last Updated on Sat, Jan 4 2025 7:54 AM

మిచాంగ్‌ పరిహారానికి నిరీక్షణ

మిచాంగ్‌ పరిహారానికి నిరీక్షణ

● 2023లో తుపానుతో అన్నదాతలకు అపార నష్టం ● 92.318 మందికి రూ 99.90 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల ● వివిధ కారణాలతో 12,955 మందికి అందని పరిహారం ● ఎన్నికల కోడ్‌ అమలుతో నిలిపివేత ● అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కూటమి’ నిర్లక్ష్యం ● కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: మిచాంగ్‌ తుపాను పరిహారానికి రైతులు నిరీక్షిస్తున్నారు. తుపాను చేసిన గాయం నుంచి నేటికీ రైతులు కోలుకోలేకపోతున్నారు. వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన పంట నష్టపరిహారం విడుదలైతే సాగుకు ఊతమవుతుందని అన్నదాతలు భావిస్తున్నారు. నిత్యం పరిహారం కోసం అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎంత కష్టం...ఎంత నష్టం...

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబరులో ఖరీఫ్‌ సమయంలో మిచాంగ్‌ తుపాను విరుచుకుపడింది. పనల మీద, కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలతో పాటుగా, మిల్లులకు తరలించే ధాన్యం సైతం తడిసిపోయింది. రైతుల కష్టాలపై స్పందించిన నాటి ప్రభుత్వం నిబంధనలు పూర్తిగా సడలించి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం.. కృష్ణా జిల్లాలో 92,318 మంది రైతులు 58,835.56 హెక్టార్లలో పంటను నష్టపోయారు. అత్యధికంగా వరి పంట 57,777.03 హెక్టార్లలో 90,741 మంది నష్టపోయారు. మొక్కజొన్న 264 మంది రైతులు 167.70 హెక్టార్లలోనూ, మినుము 89 మంది రైతులు 58.04 హెక్టార్లల్లోనూ, వేరుశనగ పంటను 1066 మంది రైతులు 681.29 హెక్టార్లలోనూ, పత్తి 158 మంది రైతులు 151.50 హెక్టార్లలో నష్టపోయారు. 92,318 మంది 58,835.56 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లటంతో నాటి ప్రభుత్వం రూ.99.90 కోట్లు కేటాయించింది. ఏ సీజన్‌కు అదే సీజన్‌లో పరిహారం అందితే సాగుకు ఆటంకాలు ఎదురుకాకుండా రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతారనేది ప్రభుత్వ ఉద్దేశం. పంట నష్టపరిహారం విడుదల చేసి రైతులకు అండగా నిలిచింది.

సాంకేతిక సమస్యలతో..

రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇబ్బందులు, ఆధార్‌ లింకేజ్‌, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తదితర సాంకేతిక పరమైన అంశాల్లో లోటుపాట్లు నెలకొనడంతో జిల్లాలో 12,955 మంది రైతులకు పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. రూ 14.68 కోట్లు పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీగా) అందాల్సి ఉంది. సమస్యను గుర్తించిన అధికార యంత్రాంగం రైతుల సమాచారాన్ని సేకరించి జాబితాను ఉన్నతాధికారులకు నివేదించింది. ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులకు చర్యలు తీసుకునే క్రమంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావటంతో పరిహారం విడుదల నిలిచింది.

స్పందన లేని ‘కూటమి’

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరిహారం అందజేతలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగును సంబరంగా చేస్తామని చెప్పిన మాటలను కార్యరూపంలో లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. పరిహారం ఎప్పుడు అందుతుందో అని ఎదురుచూడటం అన్నదాతల వంతవుతోంది. నిత్యం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఏ సీజన్‌లో రైతుకు కష్టం వస్తే అదే సీజన్‌లో పరిహారం అందించిన వైఎస్సార్‌ సీపీ సర్కారుకు, సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి పరిహారం అందజేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారుకు వ్యత్యాసం ఇదేనని చెబుతున్నారు. దీనిపై వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయ అధికారులను సంప్రదిస్తే ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, బడ్జెట్‌ కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలోనే విడుదలవుతాయని వివరించారు.

శిక్ష రైతులకా..

రైతుల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాల నమోదు అంతా అధికారులే చూస్తారు. అలాంటిది వారి వద్ద తప్పు జరిగింది. రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. ఏడాది గడిచినా నేటికీ పరిహారం అందలేదు. ప్రభుత్వం స్పందించాలి. మిచాంగ్‌ పరిహారాన్ని బాధిత రైతులకు అందించడానికి చర్యలు తీసుకోవాలి. రైతులను నిర్లక్ష్యం చేయటం సరికాదు.

–మాగంటి హరిబాబు, కౌలురైతుసంఘం,

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement