నాణ్యత ‘రోడ్డు’పాలు
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలోని వివిధ రోడ్లలో గుంతలు పూడ్చేందుకు, మరమ్మతుల కోసం రెండు నెలల క్రితం ప్రభుత్వం చర్యలు చేపట్టి, సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించింది. అయితే కొందరు నేతలు మంచి రోడ్లను మంజూరు చేయించుకుని, పై పూతలా పనులు చేసి, బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని చోట్ల జంగిల్ క్లియరెన్స్ పేరుతో పనులు మంజూరు చేయించుకొని వాటాలు పంచుకుంటున్నట్లు సమాచారం. కమీషన్లు ఇవ్వని కొన్ని చోట్ల బిల్లులకు బ్రేక్ వేయడంతో పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
మంజూరైన పనులు
● గన్నవరం పరిధిలోని మూడు పనులకు ఒక ప్యాకేజీలో ప్యాచ్ వర్క్ పేరుతో 17.40 కి.మీ.కు రూ.24లక్షలు మంజూరు చేశారు.
● మచిలీపట్నం డివిజన్‌లోని ఏడు పనులకు 85.78 కి.మీ. మేరకు రోడ్లలో జంగిల్ క్లియరెన్స్ కోసం రూ.11.45 లక్షలు మంజూరు చేశారు.
● పెనమలూరులోని తొమ్మిది బీటీ రోడ్లలో గుంతలు పూడ్చేందుకు, గన్నవరంలో మూడు పనులు కలిపి 47.53 కి.మీ.కు రూ.2.62 కోట్లు మంజూరు చేశారు.
● మచిలీపట్నం డివిజన్ పరిధిలోని మరో 294.90 కి.మీ. మేర తొమ్మిది బీటీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులకు రూ.38.50 లక్షలు మంజూరు చేశారు. వీటిలో జిల్లా ప్రధాన రహదారులు ఉన్నాయి.
● మరో 149 రోడ్లలోని గుంతలు పూడ్చేందుకు, జంగిల్ క్లియరెన్స్ పనులకు రూ.54.27 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపించారు. 569 కిలో మీటర్ల మేర ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి పూర్తవడం కల్ల...
జిల్లాలో మంజూరైన పనుల్లో ఇప్పటికి 39 రోడ్ల పనులు ప్రారంభం కాగా కేవలం 19 మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల పనులు ఆగిపోయాయి. దీంతో ఇవి పూర్తి కావడం అనుమానంగానే ఉంది.
రోడ్ల మరమ్మతుల తీరిది...
● గన్నవరం మండలం కేసరపల్లి రోడ్డుపై రూ.లక్షలతో పూడ్చిన గుంతలు మూడు నెలలకే యథాస్థితికి చేరుకున్నాయి. కేసరపల్లి నుంచి ఏలూరు కాలువ వరకు రూ.7.50 లక్షలు, కేసరపల్లి–సవారిగూడెం రోడ్డుకు రూ.4.50 లక్షలు కేటాయించారు. మూడు నెలల క్రితం కేసరపల్లిలో కలెక్టర్ బాలాజీ పనులు ప్రారంభించారు. పూడ్చిన గుంతలు అప్పుడే దెబ్బతిన్నాయి. ఏలూరు కాలువ వంతెనకు సమీపంలో దెబ్బతిన్న రోడ్డును తవ్విన కాంట్రాక్టర్ మూడు నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదు. సవారిగూడెం రోడ్డు మరమ్మతుల పనులు ఇంకా ప్రారంభించలేదు.
● కంకిపాడు–రొయ్యూరు రోడ్డుకు రూ.3.75 కోట్లు కేటాయించారు. ఐదు కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం చేపట్టగా, ప్రస్తుతం రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డు పూర్తయింది. మిగిలిన మరో కిలో మీటరు కంకర మిక్స్ పోసి ఉంచారు. ప్రస్తుతం పని ఆగిపోయి ఉంది.
● అవనిగడ్డలో ఏడు రోడ్ల మరమ్మతులకు రూ.1.80 కోట్లు మంజూరు చేశారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఎక్కడా పనులు జరగలేదు.
● పెడన మండలం నడుపూరు నుంచి ముదినేపల్లి మండలం వాడవల్లి వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు ఏడు మీటర్లు వెడల్పు నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం నేలకొండపల్లి నుంచి వాడవల్లి వరకు రోడ్డును గత 20 రోజులు కిందట తవ్వి వదిలేశారు. మళ్లీ ఎప్పుడు మొదలు పెడతారనే విషయంలో స్పష్టత లేదు. రూ.50 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.
● కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం నుంచి ఒర్లగొందితిప్ప, వీఎస్ రోడ్డు నుంచి నరసప్పచెరువు, మల్లెల చెరువు నుంచి మట్టగుంట, బీఎన్‌రోడ్డు నుంచి కొమాళ్లపూడి, పోడు నుంచి చినగొల్లపాలెం రోడ్లు పనులు ప్రారంభించాల్సి ఉంది.
● బందరు మండలంలోని మూడు గ్రామాల్లో రోడ్ల మరమ్మతులకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. ఉల్లిపాలెం బీసీ హాస్టల్ వరకు 50 అడుగుల మేర రోడ్డు పూర్తి చేయగా, పొట్లపాలెం వరకు గుంతల్లో తారు పోసి మమ అనిపించారు.
● గుడ్లవల్లేరు–రుద్రపాక సెక్షన్‌లో ఎస్‌హెచ్ రోడ్డు పరిధిలో రెండు రోడ్లు, ఎండీఆర్‌ఎస్ గుడివాడ నార్త్–పామర్రు సెక్షన్ పరిధిలో 13 రోడ్లు ఉండగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. అయితే ఇవి నత్తనడకన సాగుతున్నాయి.
జిల్లాలో 39 రోడ్ల పనులు ఆరంభం.. 19 మాత్రమే పూర్తి రహదారి పనుల టెండర్లు దక్కించుకున్న కూటమి నేతలు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని తూతూమంత్రంగా... జంగిల్ క్లియరెన్స్ పేరుతో నేతల జేబుల్లోకి ప్రజాధనం
నాణ్యతతో పూర్తికి చర్యలు
జిల్లాలో మంజూరు అయిన రోడ్లను నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. ముఖ్యంగా రోడ్లపై గుంతలు పూడ్చడంతో పాటు ఇబ్బంది కరంగా ఉన్న వాటికి నిధులు మంజూరు అయ్యాయి. వాటిని సంక్రాంతిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా చేపడుతున్నాం.
– లోకేశ్వరరావు,
ఆర్ అండ్ బీ ఈఈ, కృష్ణాజిల్లా
Comments
Please login to add a commentAdd a comment