ఇంద్రకీలాద్రిపై తగ్గిన భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చి తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శించుకునే భక్తులతో గత మూడు రోజులుగా రద్దీ నెలకొంది. ఆదివారం కూడా ఇదే విధంగా కొనసాగుతుందని ఆలయ అధికారులు భావించారు. అయితే ఉదయం నుంచి భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత క్యూలైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
దుర్గమ్మ సేవలో..
దుర్గమ్మను దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ కె. సత్యనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సత్యనారాయణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకోగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈఈ కోటేశ్వరరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను బహూకరించారు.
సూర్యోపాసన సేవ..
లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయంలోని రాజగోపురం వద్ద సూర్యభగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment