రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికులకు అవసరాల మేరకు విజయవంతంగా 90 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపి విశేషమైన మైలురాయిని సాధించిందని డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఈ నెల 1 నుంచి ప్రయాణికుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సికింద్రాబాద్, తిరుపతి, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, కొల్లం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. అదనపు రైళ్లు ఉన్నప్పటికీ రైళ్ల నిర్వహణలో 88 శాతం సమయపాలనతో డివిజన్ సరికొత్త రికార్డు నమోదు చేయడం గర్వకారణమని చెప్పారు. రద్దీ దృష్ట్యా డివిజన్ వ్యాప్తంగా అదనపు సిబ్బంది, సూపర్‌వైజర్ల ఏర్పాటు, ప్రధాన స్టేషన్లలో 30 యూటీఎఫ్, పీఆర్‌ఎస్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్‌లు తదితర ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విజయవంతంగా రైళ్ల నిర్వహణకు కృషి చేసిన సీనియర్ డీఓఎం నరేంద్ర వర్మ, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, ఇతర అధికారులను, సిబ్బందిని డీఆర్‌ఎం ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment