పెయ్యదూడల ఉత్పత్తికి వీర్యం సరఫరా
గొట్టుముక్కల(కంచికచర్ల): పశు సంవర్ధక శాఖ ద్వారా గోకులాలు, బహు వార్షిక పశుగ్రాస పెంపకం, మేలు జాతి పెయ్యదూడల ఉత్పత్తికి లింగ నిర్ధారణ వీర్యం సరఫరా చేస్తామని జిల్లా పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం.హనుమంతరావు పేర్కొన్నారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో పశువైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు గేదెల గోకులం షెడ్డుకు రూ.1.80 లక్షలు, ఆరు గేదెల గోకులం షెడ్డుకు రూ.2.30 లక్షల నిధులు కేంద్ర ప్రభుత్వ ఉపాధిహామీ పధకం నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. పశు సంవర్ధక శాఖ ద్వారా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, సైలేజీ ఉత్పత్తి కోసం 50 శాతం రాయితీపై మినీ సైలేజ్ యూనిట్‌లను రైతులకు అందజేస్తామన్నారు. పశువుల గర్భకోశ వ్యాధులకు అవసరమైన చికిత్స చేసి మందులు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలు, దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేడీ కోరారు. అనంతరం గ్రామంలోని 830 గొర్రెలు, మేకలు, పశువులు, దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు. పశు సంవర్ధక శాఖ నందిగామ ఉప సంచాలకులు జి.మోజెస్ వెస్లీ, కంచికచర్ల సహాయ సంచాలకులు కె.వెంకట్రావు, కృష్ణమూర్తి, వెటర్నరీ వైద్యుడు ఎం.నవీన్‌కుమార్, గోపాలమిత్ర అనిల్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment