ఇంద్రకీలాద్రిపై బినామీ అర్చకుడి చేతివాటం
హుండీలో నుంచి కానుకల చోరీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై చేతివాటం ప్రదర్శించిన బినామీ అర్చకుడు కటకటాలపాలైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో త్వరలో రిటైర్ కాబోతున్న సీనియర్ అర్చకుడు.. కిశోర్ అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద విధులు నిర్వహిస్తుంటాడు. సోమవారం తెల్లవారుజామున కామథేను అమ్మవారికి బాలభోగం తీసుకువచ్చేందుకు మహా మండపం ఆరో అంతస్తులోని దేవస్థాన నివేదనశాల వద్దకు వచ్చాడు. అయితే ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించే వేదిక వద్ద ఉన్న 48వ నంబర్ హుండీపై కిశోర్ కన్ను పడింది. అసలే చీకటి.. పైగా తెల్లవారుజాము కావడంతో చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత హుండీ లోపల చెయ్యి పెట్టి కానుకలు, ముడుపులను బయటకు తీశాడు. అయితే ఈ విషయం అక్కడే ఉన్న స్వీపర్ గమనించి సెక్యూరిటీ అధికారికి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని వెంటనే ఆలయ డీఈఓ రత్నరాజు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజీతో తీసుకుని దేవస్థాన ప్రాంగణంలోని పోలీసు అవుట్ పోస్ట్‌కు సమాచారం అందించారు. పోలీసులు దేవస్థాన అధికారుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. హుండీ నుంచి ఎంత చోరీ చేసింది విచారణలో తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment