గణతంత్ర వేడుకలకు ఈడుపుగల్లు సర్పంచ్
కంకిపాడు: మండలంలోని ఈడుపుగల్లు గ్రామ సర్పంచ్ పి.ఇందిరకు ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు ఆహ్వాన పత్రిక మంగళవారం పంచాయతీ కార్యాలయానికి అందింది. గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఇందిర ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకోనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పంచాయతీ తరఫున కృషి చేస్తున్నామని ఇందిర పేర్కొన్నారు.
అప్రమత్తతతో మాత,శిశు మరణాల నివారణ
జి.కొండూరు: అనారోగ్య సమస్యలు ఉన్న గర్భిణులపై వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ ఉంచడం వల్ల మాత,శిశు మరణాలను తగ్గించొచ్చని ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎం.సుహాసిని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న గర్భిణులు, తల్లీబిడ్డల సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని వెలగలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, జీజీహెచ్ గైన కాలజిస్ట్ డాక్టర్ ఇందుమతితో కలిసి డాక్టర్ సుహాసిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలు ఉన్న గర్భిణులను వైద్యాధికారులు, సిబ్బంది త్వరితగతిన గుర్తించి, వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. కాన్పుల సమయంలో వారిని విజయవాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. తల్లిపాల ప్రాము ఖ్యత, పౌష్టికాహారం, మందుల వినియోగం, సాధారణ కాన్పుల వల్ల లాభాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ మాధురీదేవి, డాక్టర్ విజయ పాల్గొన్నారు.
అగ్రిల్యాబ్‌ను సందర్శించిన మహారాష్ట్ర బృందం
కంకిపాడు: కంకిపాడులోని ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌ను మహారాష్ట్రకు చెందిన బృందం మంగళవారం సందర్శించింది. ఈ ల్యాబ్ ద్వారా అందుతున్న సేవలను మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ ప్రతినిధి బృందం అడిగి తెలుసుకుంది. అగ్రిల్యాబ్‌ల ఏర్పాటుతో రైతులకు క్షేత్రస్థాయిలో అందే సేవలపై వివరాలు నమోదు చేసుకుంది. ఈ బృందంలో అండర్ సెక్రటరీ ప్రశాంత్ పింపుల్, పూణే అగ్రికల్చర్ జేడీ దత్తాత్రేయ గవాసనే, దర్‌షావ్ జిల్లా అగ్రికల్చర్ సూపరింటెండెంట్ రవీంద్ర మనే, సీని యర్ కన్సల్టెంట్ సలీల్‌కుమార్ జెనా, కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి, డీడీఏ వెంకటేశ్వర్లు, ఏడీఏలు జయకృష్ణ, శశిధర్‌రెడ్డి, స్వర్ణలత, ఏఓలు మాధురీకిరణ్, శ్రీదేవి, శివప్రసాద్, ఏఈఓలు వాణి, భవాని, వీఏఏ కె.సురేష్ పాల్గొన్నారు.
జీఎస్‌డబ్ల్యూఎస్ డైరీ ఆవిష్కరణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ (జీఎస్‌డబ్ల్యూఎస్) నూతన సంవత్సర డైరీని ఆ శాఖ డైరెక్టర్ ఎం.శివ ప్రసాద్ మంగళవారం ఆవిష్కరించారు. విజయవాడ ఆటోనగర్‌లోని నిర్మాణ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జీఎస్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య, కోశాధికారి గోదే జ్యోతి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గుడిగుంట్ల దుర్గారావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు చేవూరి వెంకటేశ్వర్లు, సభ్యులు కొల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్లయ్య మాట్లాడుతూ.. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న పౌర సేవల విషయంలో నిబద్ధతతో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి సంస్థ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment