గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు అందించేందుకు కేబినెట్ ఆమోదించిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడానికి విధి విధానాలు రూపొందించడానికి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖామంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. గృహ నిర్మాణ యూనిట్ కాస్ట్ కూడా పెంచేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. గత టీడీపీ పాలనలో మాదిరిగానే ఇళ్లు నిర్మించుకునే ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా ఇస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందించే కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన 1.14 లక్షల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు తాళాలు అందజేస్తారన్నారు. పీఎంఏవై పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్‌కు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment