సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు
గుడివాడరూరల్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్‌ను శనివారం సాయంత్రం ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జూదాలు, కోడిపందేలు నిర్వహించే వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, బాలికల సంరక్షణకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శక్తి టీమ్‌లు, షీ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తిన సమయంలో మహిళలు, బాలికలు శక్తి, షీ టీమ్‌లకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందించిన వెంటనే అక్కడికే మహిళా పోలీసులు చేరుకుని రక్షణ కల్పిస్తారని ఎస్పీ చెప్పారు. అనంతరం స్టేషన్ ఎస్‌ఐ చంటిబాబు పనితీరును ఎస్పీ అభినందించారు. పోలీస్ సేవలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో డీఎస్పీ వి.ధీరజ్ వినీల్, తాలూకా సీఐ ఎస్‌ఎల్‌ఆర్ సోమేశ్వరరావు, ఎస్‌ఐ చంటిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment