23 కేజీల గంజాయి స్వాధీనం
విజయవాడస్పోర్ట్స్: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిటీ టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.40 లక్షల ఖరీదైన 23 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. లా అండ్ ఆర్డర్ బృందాలతో కలిసి గంజాయి అక్రమ రవాణా, విక్రయం, కొనుగోలు అంశాలపై సమగ్ర దర్యాప్తు చేశామన్నారు. గతంలో పలు మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితులపై నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.
సొమ్ము పంచుకుంటుండగా పట్టివేత..
దీనిలో భాగంగానే కంకిపాడు గ్రామానికి చెందిన పెమ్మాడి మహేష్(సస్పెక్ట్ షీటర్), తెన్నేరు రోహిత్‌కుమార్, కాటూరి మహేష్, బొడ్డు ఉమేష్, గోసాలకు చెందిన పొలాన కిరణ్ (సస్పెక్ట్ షీటర్), పోరంకికి చెందిన ఖగ్గా వెంకటతరుణ్
(రౌడీ షీటర్), తాడిగడప గ్రామానికి చెందిన కొమ్మూరు సాయికిరణ్(రౌడీ షీటర్), విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన వల్లభనేని సాయిశ్రీరామ్(సస్పెక్ట్ షీటర్), భవానీపురానికి చెందిన షేక్ అక్బర్‌బాషా(సస్పెక్ట్ షీటర్), లెనిన్‌నగర్‌కు చెందిన నాదెళ్ల తరుణ్‌చౌదరి(సస్పెక్ట్ షీటర్), మురళీనగర్‌కు చెందిన షేక్ ఫాతిమా, పూర్ణానందంపేటకు చెందిన దుంగల మురళీలను అరెస్ట్ చేశామని ఏడీసీపీ చెప్పారు. వీరందరూ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకున్నారన్నారు. గతంలో అనేక సార్లు జైలు జీవితం అనుభవించినా వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లోని కొందరు వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. గంజాయి విక్రయించగా వచ్చిన సొమ్మును హనుమాన్‌పేట సమీపంలోని ఓ పార్క్ వద్ద పంచుకుంటున్న వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయి సాగు, విక్రయం, సేవించడం, రవాణా చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 91211 62475 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీధర్, నాగశ్రీనివాసరావు పాల్గొన్నారు.
12 మంది రవాణాదారుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment