సామాజిక రాయ‘బేరాలు’ | Sakshi
Sakshi News home page

సామాజిక రాయ‘బేరాలు’

Published Thu, May 9 2024 6:45 AM

సామాజిక రాయ‘బేరాలు’

● కర్నూలులో ముస్లిం ఓట్లను చీల్చేందుకు బీజేపీ నేత కుతంత్రాలు ● ‘నోట్ల’తో ఓట్లు కొనేందుకు కుట్రలు ● తండ్రీ, కుమారుడి ఎత్తుగడలను చూసి ఛీకొడుతున్న ప్రజలు

కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ముస్లింలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండటంతో ఓ బీజేపీ నేత కుట్రలు పన్నుతున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తన కుమారుడికి వచ్చేలా కుతంత్రాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది మతపెద్దలతో సమావేశమవుతూ ఇప్పటివరకు వారికి తోడ్పా టు అందించిన విషయాలు చెబుతూ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సహాయం చేయాలని కోరుతున్నారు. కర్నూ లు శాసనసభ నియోజకవర్గంలో 1.15 లక్షల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌కు గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం వారు అండగా నిలిచారు. ఈసారి కూడా అదే జరిగితే రాజకీయ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుందని భావించిన బీజేపీ నేత ముస్లిం ఓట్లను చీల్చేందుకు ఎత్తుగడ వేశారు. కొన్ని రోజులుగా వరుసగా ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలతో తన కార్యాలయంలో చర్చలు జరుపుతున్నారు. కొంతమేరకై నా ముస్లిం ఓట్లు తన కుమారునికి వచ్చేటట్లు నజరానాలు ప్రకటిస్తున్నారు. ఆ సామాజిక వర్గంలో కీలకంగా ఉండే మరికొందరికి ఎర వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

తాయిలాల ఎర

ప్రచారానికి మరో మూడు రోజులే గడువు ఉన్నా కుమారుని వెంట ప్రచారం కంటే తెర వెనుక ఉండి వ్యూహ రచనకే బీజేపీ నేత ప్రాధాన్యమిస్తున్నాడు. ముఖ్య నేత పర్యటనలో ఒకటిరెండు సార్లు మినహా కుమారుని ప్రచారంలో ఆయన పాల్గొన్న దాఖలాలు లేవు. అందుకు ప్రధాన కారణం ఆయన బీజేపీలో ఉండటం. తెలుగుదేశం పొత్తుతో ముస్లిం ఓట్లు దూరమవుతాయన్న భయం ఆయనను వెంటాడుతోంది. ఎన్నికలు ఆయనకు అగ్నిపరీక్షగా మారాయి. ప్రత్యర్థి కంటే ఒక్క ఓటైనా ఎక్కువ సాధించకపోతే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని ఆయన భావిస్తున్నారు. ఇటీవల స్టార్‌ హోటల్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బూత్‌ స్థాయిలో ఎవరు ఎక్కువ ఓట్లు తీసుకువస్తే వారికి ఫారిన్‌ టూర్‌ ఏర్పాటు చేస్తానని, అందుకు కష్టపడాలని బూత్‌ కమిటీ సభ్యుల సమావేశంలో స్వయంగా అభ్యర్థి ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రలోభాలనే నమ్ముకుని...

బీజేపీ నేత, ఆయన కుమారుడు ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు డబ్బు ఆశ చూపి ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు. ఓటుకు రూ.1,500 నుంచి రూ.2 వేలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మొత్తాన్ని అందించేలా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. రోజూవారీ పనికి వెళ్లే కూలీలు రోడ్డుసైడు చిన్న వ్యాపారులపై దృష్టి సారించి నగదు, ఇతర తాయిలాలతో గాళం వేస్తున్నారు.ప్రచారంలోనూ భోజనాలతో పాటు నగదు ఇస్తూ అభ్యర్థి తనవెంట తిప్పుకుంటున్నాడు.

బూటకపు హామీలిస్తూ...

గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాలు, తక్కువ ఓట్లు వచ్చిన వార్డులను గుర్తించి యువకులకు డబ్బులతో ఎర వేస్తున్నారు. ముస్లింలకు ప్రయోజనాలు చేకూరుస్తామని బూటకపు హామీలిస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు ఇస్తూ ఏర్పాటు చేసుకున్న బూత్‌ కమిటీ సభ్యులు, పరిశ్రమలో పనిచేసే నమ్మకస్థులైన ఉద్యోగులు, బంధువులు, సామాజిక వర్గం అనుచరులను రంగంలోకి దింపి డబ్బు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. కొంతమందికి నగదు గాను, మరికొంతమందికి మరో మార్గంలో చెల్లింపులు జరిగిపోతున్నాయి. ఎన్నికల అధికారులేమో ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత పంపిణీకి సిద్ధం చేసిన రూ.2 లక్షలు విలువ చేసే చీరలు పట్టుబడినప్పటికీ ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేసి వదిలేశారన్న చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement