బరి తెగించిన టీడీపీ నాయకులు
కర్నూలు (టౌన్): అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు. అధికార టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తాజాగా కర్నూలు నగరంలో 23వ వార్డు కార్పొరేటర్ కటారి పల్లవి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి ఆమె అత్తపై దాడి చేశారు. సీ క్యాంప్‌లోని మునిసిపల్ స్కూల్ బాత్‌రూంల వద్ద అక్రమంగా బంకులు ఏర్పాటు చేశారు. దీని వల్ల స్కూల్‌లో చదివే బాలికలకు, మహిళా ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని ఆ వార్డు కార్పొరేటర్ ఇటీవల జరిగిన నగరపాలక సర్వసభ్య సమావేశంలో మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన అదే వార్డుకు చెందిన మంత్రి అనుచరుడు మాజీ కార్పొరేటర్ గున్నామార్కు తమ్ముడు దాసు సోమవారం శ్రీరామనగర్‌లోని కార్పొరేటర్ పల్లవి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె భర్త, వైఎస్సార్‌సీపీ వార్డు ఇన్‌చార్జ్ కటారి సురేష్‌కుమార్ లేకపోవడంతో ఇంట్లోని మహిళలతో గొడవకు దిగాడు. బూతులు తిడుతూ పల్లవిపై దౌర్జన్యం చేస్తుండగా అడ్డువచ్చిన ఆమె అత్త సత్యవేదమ్మపై చేయిచేసుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన అమె సొమ్మసిల్లి పడిపోయింది.వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత జరిగిన ఘటనపై మూడోపట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
పరామర్శించిన పార్టీ నాయకులు
కార్పొరేటర్ కటారి పల్లవి ఇంటిపై దౌర్జన్యం, దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకా, స్టాండింగ్ కమిటీ సభ్యులు విక్రమ సింహారెడ్డి, జుబేర్, యూనుసుబాషా, కార్పొరేటర్లు సిట్రా సత్యనారాయణమ్మ, షాషావలీ, షేక్ అహమ్మద్ సోమవారం సాయంత్రం బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ 75 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధురాలిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అండ చూసుకునే టీడీపీ మాజీ కార్పొరేటర్ గున్నామార్కు, ఆయన సోదరుడు, అనుచరులు రెచ్చిపోతున్నారన్నారు. ప్రజా సమస్యలను కార్పొరేటర్ ప్రశ్నిస్తే దాడి చేస్తారా.. ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రశ్నించారు. కర్నూలు కార్పొరేషన్‌లో గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదన్నారు. కార్పొరేటర్ కుటుంబ సభ్యులపై దాడి విషయాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌పై దౌర్జన్యం
అడ్డు వచ్చిన అత్తపై దాడి
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు
పరామర్శించిన వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు, మేయర్, కార్పొరేటర్లు
Comments
Please login to add a commentAdd a comment