ఇలా ‘ఐ’తే.. చూపు మాయం
కర్నూలు(హాస్పిటల్): ఒకప్పుడు కంటి అద్దాలు పెట్టుకుంటే వీడికి నాలుగు కళ్లు వచ్చాయిరా అని ఎగతాళి చేసేవారు. దృష్టి లోపం వచ్చిందంటే అదో పెద్ద సమస్యగా చూసేవారు. అది ఇప్పుడు సాధారణమైపోయింది. పాఠశాల నుంచి ప్రొఫెషనల్ కాలేజీల్లోని విద్యార్థుల వరకు అధిక శాతం పిల్లలు ఇప్పుడు కంటి అద్దాలు ధరించి చదవాల్సి వస్తోంది. చిన్నతనంలోనే ఆరోగ్య సమస్యలు గుర్తించి వారికి వైద్యమందిస్తే పెద్దయ్యాక దుష్ప్రభావాలు కనిపించవనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో చిన్నారులకు పాఠశాల స్థాయిలోనే కంటి పరీక్షలు నిర్వహించారు. గత మార్చి వరకు జిల్లాలోని 4,351 పాఠశాలల్లో ఉన్న 6,73,728 మంది 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 37,329 మందికి దృష్టిలోపం ఉందని నిర్ధారించి 14,525 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 20 మంది చిన్నారులకు కాటరాక్టు ఉన్నట్లు నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు. మరో 148 మందికి ఇతర కంటి సమస్యలు ఉండటంతో ఆపరేషన్లు చేశారు.
కంటి చూపును తినేస్తున్న బ్లూరేస్
మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌ల నుంచి వెలువడే బ్లూ రేస్ (అతినీలలోహిత కిరణాలు) కంటి చూపును దెబ్బతీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు తదేకంగా గంటల కొద్దీ మొబైల్ పోన్‌లు, ట్యాబ్‌లు చూడటం వల్ల దృష్టి లోపాలు పెరుగుతున్నాయి. వీటిలోని బ్లూ రేస్ నేరుగా కంటిపై పడటం వల్ల మయోపియా అనే దృష్టిలోప సమస్య వస్తుంది. దీనివల్ల కంటిచూపు తగ్గడం, తలనొప్పి లక్షణాలు అధికమవుతాయి. అలాగే డ్రై ఐస్ (కళ్లల్లో నీరు ఎండిపోవడం) వంటి సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు ఎర్రగా కావడం, ఒత్తుకున్నట్లు ఉండటం వంటి ఇబ్బందులు ఉంటాయి. దీన్ని అలాగే వదిలేస్తే నల్లగుడ్డుపై తెల్లమచ్చలు వస్తాయి. మరికొందరు చిన్నారుల్లో మందబుద్ధి, ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవడం, చిన్నపిల్లలతై త్వరగా మాటలు రాకపోవడం వంటి సమస్యలూ వస్తున్నాయి.
చిన్నారుల్లో దృష్టిలోపాల లక్షణాలు
దగ్గరగా, దూరంగా ఉన్న వస్తువులను సరిగ్గా చూడలేకపోవడం, అస్పష్టమైన చూపు, చదవడంలో పిల్లలకు ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి.
దృష్టిలోపానికి కారణాలు
పిల్లల్లో ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి, గ్లకోమా, జీరాప్తాల్మియా వంటి కంటి వ్యాధులు వస్తాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలు, మేనరికపు వివాహాలు, గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీసుకునే కొన్ని రకాలైన మందుల వల్ల పుట్టుకతో కంటిజబ్బులు వస్తాయి. మేనరికం వల్ల రెటినైసిస్ పిగ్మెంటోజా, ఆర్‌ఓపి అనే కంటి జబ్బులు ప్రీమెచ్యూర్ పిల్లల్లో వస్తున్నాయి.
కంటి విషయంలో జాగ్రత్తలు
†పుస్తకాలను కంటికి అడుగున్నర దూరంలో, తగినంత వెలుతురులోనే చదవాలి.
†దుమ్ము, పొగ, ప్రకాశవంతమైన కాంతిని నేరుగా చూడకూడదు.
†కంటికి సుర్మా, కాటుక వంటివి వాడకూడదు.
†చదివే సమయంలో, కంప్యూటర్, సెల్‌ఫోన్, ట్యాబ్ చూస్తున్నప్పుడు కంటికి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విధిగా విరామం ఇవ్వాలి. దృష్టిలోపం ఉంటే కళ్లజోడు వాడటం తప్పనిసరి.
మొబైల్‌తో చిన్నారులకు మరీ డేంజర్
పిల్లలపై బ్లూరేస్ ప్రభావం
చిన్న తనంలోనే దృష్టి లోపాలు
30 శాతం మంది పిల్లలకు కంటిచూపు సమస్య
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణంగా ఉండేది. కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ హస్తభూషణం అయ్యికూర్చుంది. పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ఇప్పుడు మొబైల్ లేని వారు కనిపించని పరిస్థితి. ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్ చేతిలో ఉండాల్సిందే. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ అధిక శాతం గడిపేస్తున్నారు. చిన్నపిల్లల్లో ఈ వైపరిత్యం మరీ ఎక్కువైంది. పగలూ రాత్రి తేడా లేకుండా మొబైల్‌కు బానిసలయ్యారు. దీనివల్ల చిన్నతనంలోనే దృష్టి లోపాలతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి
ఇటీవల కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యారు. పాఠశాల నుంచి రాగానే మొబైల్ పట్టుకుని గంటల తరబడి చూడటం పరిపాటిగా మారింది. కొంత మంది అర్ధరాత్రి వరకు మేల్కొని సెల్‌ఫోన్ చూస్తూ గడుపుతున్నారు. ఇలాంటి పిల్లల్లో కంటి సమస్యలతో పాటు ఊబకాయం, చురుకుదనం లోపించడం, ఇతరులతో సరిగ్గా మాట్లాడలేకపోవడం, మెడ, వెన్నుముక సమస్యలు, చదువులో వెనుకబడిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి పిల్లలకు నయానో, భయానో మొబైల్ చూడటం మాన్పించి వ్యాపకాల వైపు దృష్టి మళ్లించాలి. అప్పుడే చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.
– డాక్టర్ కె.సిందూర, చిన్నపిల్లల వైద్యురాలు, కర్నూలు
మయోపియా బాధితులు ఎక్కువయ్యారు
మొబైల్‌ను తదేకంగా ఎక్కువసేపు చూడటం వల్ల దృష్టిలోపం అధికమవుతోంది. దీనినే వైద్య పరిభాషలో మయోపియా అంటారు. ఈ సమస్యతో చాలా మంది చికిత్స కోసం వస్తున్నారు. పిల్లలకు చికిత్సతో పాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్‌ను చూడటం వల్ల దృష్టిలోపంతో పాటు కళ్లు డ్రైగా మారడం, కళ్ల మంటలు, దురద సమస్యలుంటాయి. పెద్దవారు మొబైల్ స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడాల్సి వస్తే బ్లూకట్ గ్లాసెస్ వాడాలి.
–డాక్టర్ జె.జె.ప్రవీణ్, కంటి వైద్యనిపుణులు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment