కర్నూలు (అర్బన్): జిల్లాలోని స్థానిక సంస్థలకు (2024–25 ఆర్థిక సంవత్సరానికి) 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులు రూ.60.03 కోట్లు గురువారం విడుదలయ్యాయి. కేటాయింపుల మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లా పరిషత్‌కు బేసిక్ గ్రాంట్ కింద రూ.5,33,72,556, టైడ్ గ్రాంట్ కింద మరో రూ.8,00,59,140 విడుదలైనట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 మండలాలకు బేసిక్ గ్రాంట్ కింద రూ.5,42,88,238, టైడ్ గ్రాంట్ కింద రూ.8,14,32,379 మేర నిధులు విడుదలయ్యాయని తెలిపారు. మండలాలకు సంబంధించి అత్యధికంగా ఆదోని మండలానికి రూ.47.99 లక్షలు, ఆ తర్వాత బనగానపల్లె మండలానికి రూ.47.18 లక్షలు విడుదలయ్యాయని జెడ్పీ సీఈఓ వెల్లడించారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీలకు అన్‌టైడ్ గ్రాంట్ కింద రూ.13,24,97,103, టైడ్ గ్రాంట్ కింద రూ.19,87,45,647 మేర నిధులు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామ పంచాయతీలకు ఈ నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
జెడ్పీకి రూ.13.34 కోట్లు,
మండలాలకు రూ.13.57 కోట్లు
484 గ్రామ పంచాయతీలకు
రూ.33.12 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment