ఇసుక టిప్పర్లను అడ్డుకున్న రేమట ప్రజలు
● తమ గ్రామం మీదుగా వెళ్లొద్దంటూ నిరసన
కర్నూలు(రూరల్): తమ గ్రామం మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ రేమట గ్రామస్తులు రోడ్డెక్కారు. సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె ఇసుక రీచ్‌లకు వెళ్తున్న ఇసుక టిప్పర్లను బుధవారం వారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. భారీ టిప్పర్ల రాకపోకల మూలంగా కర్నూలు జెడ్పీటీసీ సభ్యుడు, గ్రామ నాయకుడు, ప్రసన్నకుమార్‌తోపాటు గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు సైతం టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. గంటల తరబడి టిప్పర్లను అడ్డుకుని వెనక్కు పంపించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ తమ గ్రామ ప్రజల ఇబ్బందులను అధికారులు గుర్తించి టిప్పర్ల రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక రీచ్‌కు నిడ్జూరు, జి.సింగవరం మీదుగా వెళ్లాల్సిన టిప్పర్లు ఉల్చాలతోపాటు తమ గ్రామం మీదుగా వెళ్లడం సమంజసం కాదన్నారు. కేవలం 12 కిలోమీటర్లు దూరం తగ్గుతుందని భావించి తమ గ్రామాల మీదుగా వెళ్లడం తగదన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వందల వాహనాలు వెళ్లడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు, రైతులు ఉదయం ఇరుకైన రోడ్డుపై వెళ్లేందుకు జంకుతున్నారన్నారు. వాహనాల శబ్ధాలకు ఎద్దులు బెదిరిపోతున్నాయన్నారు. కేవలం ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వం నిర్మించిన రోడ్డు ధ్వంసం అయ్యిందన్నారు. అధికారులు స్పందించి తమ గ్రామం మీదుగా ఇసుక టిప్పర్లు రాకపోకలు సాగుకుండా చూడాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment