పరికరాల నిర్వహణపై అవగాహన కల్పించాలి
కర్నూలు(అగ్రికల్చర్): సూక్ష్మ సేద్యంలో రాణిస్తున్న రైతులకు వాటి పరికరాల నిర్వహణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి తెలిపారు. బుధవారం స్థానిక ఉద్యానభవన్‌లో సూక్ష్మ సేద్యం పరికరాలు, మెటీరియల్ సరఫరా చేసే కంపెనీలు, ఎంఐఏఓలు, రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ ఉమాదేవీ మాట్లాడుతూ రైతులకు డ్రిప్ పరికరాలు సరఫరా చేయడంతోపాటు వాటి పనితీరు, నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో 70 శాతం నీరు సాగుకు, 22 శాతం పరిశ్రమలకు, మిగిలిన 8 శాతం నీరు తాగు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర రంగాల నుంచి సాగునీటికి పోటీతత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అగ్రానమిస్ట్ ఏఎస్ సుబ్బారావు సూక్ష్మ సేద్యంలోని మెలకువలను వివరించారు. శిక్షణ పొందిన రైతులు, ఎంఐఏఓలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ అదనపు పీడీ రాజాకృష్ణారెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి
Comments
Please login to add a commentAdd a comment