విద్యుత్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల విచారణ
డోన్ టౌన్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారుల బుధవారం విద్యుత్ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ పని చేసి బదిలీ అయిన అధికారి మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధిస్తుండటంతోపాటు మిగతా సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తానని డబ్బు కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ ఎస్‌ఐ మౌలానీ విచారణ చేపట్టారు. కార్యాలయానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అధికారి గెస్ట్ హౌస్‌గా ఉపయోగించుకుంటున్నట్లు చెబుతున్న గదిని కూడా తనిఖీ చేశారు. వాచ్‌మెన్, అటెండర్ నుంచి వివరాలు ఆరా తీశారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతానని విజిలెన్స్ ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ వెంట ఏఈ నాగేశ్వరరెడ్డి ఉన్నారు.
ఉపాధ్యాయినికి
సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్
శిరివెళ్ల: మండల కేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినికి టోకరా వేయడానికి గురువారం సైబర్ నేరగాళ్లు విఫలయత్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన సిమ్ నెంబర్లు 923231025122, 923131491446తో ఇద్దరు సైబర్ నేరగాళ్లు 10 సార్లు ఉద్యోగినికి వాట్సాప్ కాల్స్ చేశారు. తాము సీబీఐ అధికారులమని, మీ కూతురికి డ్రగ్స్ కేసులతో సంబంధం ఉందని, వదిలేయాలంటే రూ.30 వేలు ఫోన్‌పే చేయాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి ఆమె ఫోన్ కట్ చేసి కూతురికి కాల్ చేసింది. అలాంటిదేమీ లేదని, అది సైబర్ నేరగాళ్ల పనై ఉంటుందని కూతురు చెప్పడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది.
ప్రాక్టికల్స్‌కు అనుమతులు
కర్నూలు సిటీ: ప్రైవేట్ డీఎల్‌ఈడీ కాలేజీల్లో 2018–20 విద్యా సంవత్సరానికి స్పాట్, మేనేజ్‌మెంట్ కోటాలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు సెకెండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ప్రభుత్వ డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ షంషుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిళ్లతో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎడ్ల బండిపై నుంచి
కింద పడి వ్యక్తి మృతి
వెలుగోడు: గుంతకందాల గ్రామానికి చెందిన కోళ్ల బోయిన గోపాల్(54) ఎడ్ల బండి పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గురువారం ఎడ్ల బండిపై ఎరువుల బస్తాలు వేసుకొని తన పంట పొలానికి వెళ్లాడు. అక్కడ ఎరువుల బస్తాలు దించే క్రమంలో ఎద్దుల ముందుకు కదలడంతో గోపాలు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెలుగోడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం నంద్యాలకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
బాలిక మృతదేహం లభ్యం
వెలుగోడు: అయ్యవారిపల్లె గ్రామ సమీపంలో ఉన్న నిప్పుల వాగులో ఈనెల 18న బాలిక గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజులు గాలింపు చర్యల అనంతరం గురువారం బండిఆత్మకూరు మండలంలోని ఎరగ్రుంట్ల గ్రామం రమణారెడ్డి పొలంలో జమ్ము గడ్డి వద్ద బాలిక మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి బాలిక మృతదేహాన్ని బయటికి తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment