పడకేసిన బిజినెస్‌లు
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం కుదేలు
పెరిగిన ధరలతో తగ్గిన కొనుగోలు శక్తి
పథకాల లేమితో ప్రజల్లో డబ్బు కొరత
అత్యవసరం ఉంటేనే ఏ వస్తువైనా కొనుగోలు
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 వేల మంది వివిధ ట్రేడ్‌ల వ్యాపారులు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వస్తుసేవలకు సంబంధించి వసూలు చేసే పన్నులను ఈ శాఖ వసూలు చేస్తుంది. దీనినే జీఎస్‌టీ అంటారు. ఇలా వసూలు చేసిన పన్నులో సగం కేంద్రానికి, సగం రాష్ట్రానికి చెందుతుంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజల వద్దకు వివిధ పథకాల రూపేణా డబ్బు చేరుతుండేది. వారు వివిధ వస్తువు కొనుగోలు చేయడంతో మార్కెట్‌లోకి డబ్బు వచ్చేది. ఇలా ఒకరి నుంచి మరొకరికి విరివిగా డబ్బు మారడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపేణా బాగా ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మార్చి వరకు జీఎస్‌టీ వసూళ్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలు వ్యాపారాలు స్తబ్దుగా మారాయి.
ఎన్నికల ఫలితాల అనంతరం సైతం ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరంతో పోలిస్తే గత ఆరు నెలల కాలంలో జీఎస్‌టీ వసూళ్లు 40 శాతం పడిపోయినట్లు సమాచారం. కర్నూలు, నంద్యాలతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ లాంటి ప్రాంతాల్లో గత వైఎస్సాసీపీ ప్రభుత్వంలో భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు బాగా జరిగేవి.
గతంలో కర్నూలు లాంటి ప్రాంతంలో రోజుకు వివిధ రకాల రిజిస్ట్రేషన్లు 150 దాకా జరిగేవి. ప్రస్తుత ప్రభుత్వంలో 80 కూడా జరగడం లేదని డాక్యుమెంట్ రైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూములు, ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలు, అమ్మకాల వ్యవహారాలు పూర్తిగా తగ్గిపోయాయి. కొనడానికి ఎవ్వరూ రాకపోవడంతో కర్నూలు, నంద్యాలలోని శివారు ప్రాంతాలు, డోన్, ఆళ్లగడ్డ, ఆదోని లాంటి ప్రాంతాల్లో ధరలు తగ్గించి మరీ విక్రయిస్తున్నారు.
మార్కెట్‌లో ఇదీ పరిస్థితి
● ఇసుక అధిక ధరలు, సమయానికి దొరకకపోవడం వల్ల భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీనివల్ల సిమెంటు, స్టీలు వ్యాపారాలు పూర్తిగా మందగించాయి.
● ప్రభుత్వం 22ఏ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం, టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను మామూళ్ల కోసం వేధించడంతో ఆ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో కర్నూలు జిల్లాలో గతంలో రోజుకు 160 వరకు డాక్యుమెంట్లు జరిగేవి. ప్రస్తుతం 80కు మించి డాక్యుమెంట్లు జరగడం లేదు. దీంతో నగదు రొటేషన్ మందగించింది.
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డీబీటీ సిస్టమ్ ద్వారా నగదు బదిలీ ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందడం వల్ల కొనుగోళ్లు పెరిగేవి. ఆ పథకాలు ఆగిపోవడం వల్ల వ్యాపారాలపై ప్రభావం పడింది. ఈ క్రమంలో కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న స్పెన్సర్స్ షాపింగ్ మాల్ మూతపడగా, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒకటిగా ఉన్న రిలయన్స్ మార్ట్ మూడు కౌంటర్లు (అనంత కాంప్లెక్స్, నంద్యాల చెక్‌పోస్టు, నరసింహారెడ్డి నగర్) మూతపడ్డాయి.
● కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల కూడా వ్యాపారాలు మందగించాయి.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, వ్యాపార వ్యతిరేక విధానాలతో ఆదోనిలో జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్, వంటనూనెల పరిశ్రమలు మూతబడి వేలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
పడిపోయిన వ్యాపారాలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాలో నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రకటించిన ఈ ప్రభుత్వంలో వాటి ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు ఇసుక ఎక్కడా లభించని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ కారణంగా సిమెంట్, స్టీలు వ్యాపారాలు తగ్గిపోయాయి. నిర్మాణాలకు అనుబంధంగా ఉన్న ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ వ్యాపారాలూ మందగించాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీలు, మొబైల్ ఫోన్లు కొనడం తగ్గింది. గృహోపకరణాలైన మిక్సీలు, కుక్కర్లు, ఐరన్‌బాక్స్‌లు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్లను అత్యవసరమైతే తప్ప కొనడం లేదు.
దుకాణంలో నిలుచున్న వ్యక్తి పేరు నరేంద్రకుమార్. 40 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి వీరి కుటుంబం వచ్చి కర్నూలులో స్థిరపడింది. స్థానిక ఠాగూర్ నగర్‌లో ఎలక్ట్రికల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం వరకు రోజుకు రూ.5 వేలకు పైగా వ్యాపారం జరిగేది. గత ఐదు నెలలుగా వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేవలం రూ.2 వేల లోపే రోజుకు వ్యాపారం జరుగుతోంది. దీంతో దుకాణంలో వర్కర్లను మాన్పించి కుమారుడితో ఇతను వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు పదవ తరగతి వరకు మాత్రమే చదివి ఆపై మానేశాడు. కళాశాల ఫీజు కట్టలేక ఉన్నత చదువు చదివించలేదని నరేంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మెడికల్‌షాపులో కూర్చున్న వ్యక్తి పేరు ప్రదీప్. గత కొన్నేళ్లుగా ఇతను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎదురుగా వ్యాపారం చేస్తున్నాడు. గత సంవత్సరం వరకు రోజుకు రూ. 20వేల దాకా వ్యాపారం జరిగేది. ప్రస్తుతం రూ.15వేలు కూడా జరగడం లేదు. మార్కెట్‌లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో సగటు మానవుని కొనుగోలు శక్తి పడిపోయింది. కాబట్టి వస్తువైనా, మందులైనా అత్యవసరం ఉంటేనే కొనుగోలు చేస్తున్నాడు. అదే పరిస్థితి మాకూ వచ్చిందనిపిస్తోందని చెబుతున్నాడు ఈయన. దీనికితోడు ఆన్‌లైన్ మార్కెట్ సైతం బాగా దెబ్బతీస్తోందని, ఆన్‌లైన్‌తో పాటు పోటీ మార్కెట్‌లో డిస్కౌంట్‌లు ఇచ్చే వ్యాపారం చేయలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment