తల్లీ...బిడ్డకు జన్మనిస్తూ మరణించకూడదు... జన్మిస్తూ ఏ శ
కర్నూలు పెద్దాసుత్రిలోని మాతాశిశు భవనం
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఎమ్మిగనూరు, ఆదోనిలో మాతాశిశు ఆసుపత్రులు, డోన్, ఆళ్లగడ్డలలో ఏరియా ఆసుపత్రులు, కర్నూలు, ఆదోని, నంద్యాలలో జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి సంవత్సరం 90వేల నుంచి 95వేల దాకా ప్రసవాలు జరుగుతున్నాయి. మహిళ 12 వారాల గర్భం దాల్చిన వెంటనే ఏఎన్‌ఎంలు తమ యాప్‌లో నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. ఆ తర్వాత ప్రతి నెలా 9వ తేదీన ప్రతి ఆరోగ్య కేంద్రంలో జరిగే ప్రధాన మంత్రి మాతృవందన యోజన అనే కార్యక్రమంలో గర్భిణులకు అన్ని పరీక్షలు నిర్వహించి మాతాశిశు సంరక్షణ కార్డులో వివరాలు నమోదు చేయించాలి. కడుపులోని బిడ్డకు చేసే టిఫా స్కానింగ్ సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయించాలి. ప్రతి నెలా గర్భిణికి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ రక్తహీనత, హైబీపీ లేకుండా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలి. హైరిస్క్ గర్భిణిగా గుర్తించిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. ఆశా, ఆరోగ్య కార్యకర్త పర్యవేక్షణలో గర్భిణిని పర్యవేక్షిస్తూ ప్రసవ తేదీకి వారం ముందుగానే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో సుఖప్రసవమయ్యేలా చూడాలి.
మూడు నెలల్లో 16 మాతృమరణాలు
గర్భిణుల పట్ల క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, మెడికల్ ఆఫీసర్లు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ పర్యవేక్షణ చేస్తున్నారని చెబుతున్నా వాస్తవంగా పూర్తిస్థాయిలో అవి అమలు కావడం లేదు. తూతూ మంత్రంగా గర్భిణులకు వైద్యసేవలు అందుతున్నాయి. ప్రతి నెలా 9వ తేదీన తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించేవారే కరువయ్యారు. చాలా ఆసుపత్రుల్లో గర్భిణులకు టిఫా స్కానింగ్‌లు చేయడం లేదు. ఎక్కువ మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈ పరీక్ష చేయించుకుంటున్నారు. రెగ్యులర్‌గా వైద్యపరీక్షలు చేయించినట్లు, మందులు ఇస్తున్నట్లు, పరీక్షలు చేయిస్తున్నట్లు రికార్డుల్లో మాత్రమే నమోదవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గర్భిణిగా ఉన్న సమయంలో వారికి సూచనలు, సలహాలు ఇచ్చే వారే కరువయ్యారు. ఏఎన్‌ఎంలు ఎక్కువ శాతం యాప్‌లో వివరాలు నమోదు చేయడానికే సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో 60 శాతం గర్భిణిలు రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్నారు. దీంతో గత మూడు నెలల్లో ఏకంగా 16 మంది గర్భిణులు ప్రసవ సమయంలో కన్నుమూశారు. వీరిలో అధిక శాతం క్షేత్రస్థాయిలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు తిరిగి చివరకు కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్సకు వచ్చి మరణించారు. ఇందులో దాదాపు అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. వీరి మరణాలకు ప్రధాన కారణం బీపీ, రక్తహీనత, పలు రకాల అనారోగ్య సమస్యలు. కానీ ప్రసవ సమయంలో సహజంగా అందరికీ వచ్చే గుండె, ఊపిరితిత్తుల సమస్యల వల్లే మరణించారంటూ అధికారులు నివేదికలు తయారు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వీరికి మొదటి నుంచి వైద్యపరీక్షలు, వైద్యచికిత్సలు చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మృతుల కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు మాతృమరణాలపై జిల్లా అధికారులు, వైద్యులు, సిబ్బంది అందరూ కూర్చుని చేసే సమీక్షలు సైతం మొక్కుబడిగా సాగుతుండటం విమర్శలకు తావిస్తోంది. కొన్నేళ్లుగా ఈ సమీక్షలు జరుగుతున్నా ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న సాహసం చేయలేదు. అన్ని మరణాలు అరికట్టలేనివంటూ నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గర్భిణిపై మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మరణాన్ని అరికట్టే అవకాశం ఉంది. అయితే, వైద్యులు, సిబ్బంది చిత్తశుద్ధితో ఆ పని చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు నెలల్లో 16 మంది గర్భిణులు మృతి
రక్తహీనత, బీపీతో పాటు వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
నామమాత్రంగా వైద్యసేవలు
క్షేత్రస్థాయి నుంచి సరైన పర్యవేక్షణ చేస్తే మరణాలు అరికట్టే అవకాశం
ఆ దిశగా దృష్టి సారించని అధికారులు
మాతృ మరణాలపై తూతూమంత్రంగా సమీక్షలు
పత్తికొండ పట్టణంలోని బుడగ జంగాల కాలనీకి చెందిన మౌనిక(20) తొలి ప్రసవంలో భాగంగా నెలలు నిండటంతో గత నెల 30వ తేదీన భర్త మహేష్‌తో కలిసి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆమెకు సాధారణ ప్రసవం కోసం వైద్యులు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో కడుపులోనే శిశువు మృతి చెందింది. వైద్యులు మృత శిశువును తీసి తల్లిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మౌనిక కూడా మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment