మానసిక దివ్యాంగులకు అనేక చట్టాలు
కర్నూలు(హాస్పిటల్): మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి చెప్పారు. కర్నూలు రెడ్‌క్రాస్ సొసైటీ, వికలాంగులు, లింగమార్పిడి అండ్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సమన్వయ సహకారంతో మంగళవారం స్థానిక బి.క్యాంపులోని బాలుర వికలాంగుల వసతి గృహంలో దివ్యాంగులకు దుప్పట్లు, దిండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మానసిక దివ్యాంగుల సంరక్షణకు స్నేహపూర్వక న్యాయ సేవల పథకం 2005 గురించి వివరించారు. వీరందరికీ ఉచిత న్యాయ సహా యం అందిస్తామన్నారు.అవసరమైన వారు లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నెంబర్–15100ను ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శివరామచంద్రరావు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, సభ్యులు కేవీ సుబ్బారెడ్డి, భీమశంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఏడు రోజులు
ప్రత్యేక ఆధార్ క్యాంప్‌లు
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఏడు రోజుల పాటు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు కర్నూలు డీఎల్‌డీఓ జీవీ రమణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రత్యేక ఆధార్ కేంద్రాలను చిన్నారుల ఆధార్ నమోదు కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఆధార్ కేంద్రాలు ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు (నాలుగు రోజులు), తిరిగి 26 నుంచి 28వ తేదీ వరకు (మూడు రోజులు) గ్రామ సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 0 నుంచి 5 ఏళ్ల చిన్నారులు 1,06,944 మంది ఉండగా, ఈ నెల 11వ తేదీ వరకు ఉన్న సమాచారం మేరకు 2,113 మంది మాత్రమే ఆధార్ నమోదు చేసుకున్నారన్నారు. మిగిలిన చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధార్ నమోదు చేయించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేయండి
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న గుడ్ గవర్నెన్స్ వీక్‌లో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో, డివిజినల్ స్థాయిలో ఆర్‌డీఓ, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక డెస్కులను ఏర్పాటు ఏర్పాటు చేయాలని ప్రత్యేకాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా అవసరమైన పౌర సేవలను అందించాలని, ఇందుకు సంబంధించి ప్రతీరోజూ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈనెల 23వ తేదీన సుపరిపాలన అంశంపై జిల్లాస్థాయిలో వర్కుషాపును నిర్వహించాలని డీఆర్వోకు సూచించారు.
హాస్టల్ సమస్యల
పరిష్కారానికి కృషి
మంత్రాలయం: మండల కేంద్రం మంత్రాలయంలోని బీసీ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి వెంకటలక్ష్ముమ్మ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆమె బీసీ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో తాగునీటి, లైటింగ్, ట్యూటర్ సమస్యలను ఉన్నాయంటూ విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మెనూ అమలు కావడం లేదని ఫిర్యాదు చేశారు. తాగునీటి మోటార్‌కు వెంటనే మరమ్మతులు చేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామమని ఆమె తెలిపారు. ఆమె వెంట కర్నూలు అర్బన్ అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారి ఆంజనేయులు, ఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment