కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షలకు 87 శాతం, మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షలకు 77 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగగా మొదటి సెమిస్టర్ పరీక్షలకు 10,504 మందికి 9,125 మంది విద్యార్థులు హాజరు కాగా 1,379 మంది గైర్హాజరయ్యారు. మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షలకు 62 మందికి 48 మంది హాజరు కాగా 14 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కర్నూలు శంకరాస్ డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, పత్తికొండ వైష్ణవి డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు రవీంద్ర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, డోన్ శ్రీ సాయి డిగ్రీ కళాశాల, కర్నూలు డిగ్రీ కళాశాల, పత్తికొండ శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాల, కర్నూలుసెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల, తుగ్గలి ఏఎస్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 16 మంది విద్యార్థులు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు.
ముగిసిన పంట బీమా గడువు
కర్నూలు(అగ్రికల్చర్): శనగ, వేరుశనగ, ఉల్లి, టమాట, జొన్న పంటలకు ఈనెల 16తో బీమా గడువు ముగిసింది. వరికి మాత్రం ఈ నెల చివరి వరకు ఉంది. అయితే, పంట బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లించేందుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపలేదు. వరితో సహా ఇతర అన్ని పంటలకు కలిపి 44,514 మంది మాత్రమే ప్రీమియం చెల్లించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫైడ్ పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు ఉచిత పంట బీమా అమలయ్యేది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం దీనికి స్వస్తి పలికి బీమా భారం రైతులపైనే వేసిన విషయం తెలిసిందే.
డ్రెస్ కోడ్ లేకపోతే జరిమానా
మహానంది: దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న అర్చకులు, రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఏజెన్సీ ఉద్యోగులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని లేకపోతే రూ. 500 జరిమానా విధి స్తామని మహానంది ఈఓ నల్లకాలువ శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ/కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. బుధవా రం ఈఓ విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది అందరూ తిలకధారణతో విధులకు హాజరు కావాలన్నారు. అర్చకులు పంచ, కండువా, శిఖతో సంప్రదాయంగా రావాలన్నారు. సిబ్బంది తెల్లచొక్కా, తెల్లపంచ ధరించాలన్నారు. భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వీఐపీలు వచ్చినప్పుడు ప్రొటోకాల్ పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు ఒకరోజు వేతనం నిలిపేస్తామన్నారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment