రుణాల మంజూరులో లక్ష్యాన్ని చేరుకోవాలి
● బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు
సమన్వయంతో పనిచేయాలి
● కలెక్టర్ రంజిత్‌బాషా
కర్నూలు(సెంట్రల్): రుణాల మంజూరులో లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా బ్యాంకర్లను ఆదేశించారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రుణాల మంజూరులో 67.78 శాతమే నమోదైందని, రూ.15,068.46 కోట్లకు గాను 10,212.96 కోట్ల రుణాలు మాత్రమే రెండో త్రైమాసికం వరకు మంజూరు చేసినట్లు చెప్పారు. మానవీయకోణంలో ఆలోచన చేసి రుణాలను మంజూరు చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో బ్యాంకర్లకు సంబంధించి డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాలను కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, పేదలకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరులో పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూకోబ్యాంకు, ధనలక్ష్మీబ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, కరూర్ వైశ్యా బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకులు వెనుకబడి ఉన్నాయని, నిర్ధేశించిన మేరకు రుణాలను ఇవ్వాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం, విశ్వకర్మ యోజనకు సంబంధించిన దరఖాస్తులను డిసెంబర్ 31 లోపు పరిష్కరించాలన్నారు. జనవరి 15వ తేదీలోపు పెండింగ్‌లో ఉన్న ముద్రలోన్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రిలిమినరీ రిపోర్టుకు, ఆత్మహత్యలకు కారణాలతో నివేదికను తనకు సమర్పించాలని జిల్లా వ్యవసాయాధికారిని ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు మేనేజర్ రామచంద్రరావు, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గిరిధర్ బెహేర, కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్ దిలీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment