కేసుల పరిష్కారంలో కర్నూలు నెంబర్ వన్
కర్నూలు (టౌన్): జాతీయ లోక్ అదాలత్‌లో 7,913 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు బుధవారం విజయవాడలో డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీహెచ్ తిరుమల రావు చేతుల మీదుగా జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ప్రశంసా పత్రం అందుకున్నారు. అలాగే డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్, కర్నూలు మూడవ పట్టణ సీఐ శేషయ్య, కోర్టు మానిటరింగ్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్, కర్నూలు మూడవ పట్టణ కానిస్టేబుల్ జాన్సన్, కర్నూలు తాలూకా కానిస్టేబుల్ తిక్క స్వాములకు డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో లోక్ అదాలత్‌లో పరిష్కారానికి అర్హత కలిగిన కేసులను ముందుగా గుర్తించి ఆయా కేసుల్లో ఫిర్యాదిదారులు, కక్షిదారుల మధ్య సమన్వయం సాధించేందుకు క్షేత్ర స్థాయిలో చక్కని ప్రణాళికతో పనిచేశామన్నారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పోలీసు అధికారులు పనిచేయాలన్నారు.
ఆస్పరి పోలీసులకు డీజీపీ అభినందన
ఆస్పరి: హత్య కేసు మిస్టరీ వారం రోజుల్లో ఛేదించిన ఆస్పరి పోలీసులను బుధవారం విజయవాడలో డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. ఈ ఏడాది జూలై 28న గోనెగండ్ల మండలం మసీదుపురం గ్రామానికి చెందిన పేటయ్యను (45)ను ఆలూరు మండలం హుళేబీడులో హత్య చేసి డ్రమ్ములో కుక్కి ఆస్పరి మండలం చిన్నహోతూరు వద్ద ఉన్న వంకలో పడేశారు. కేసు నమోదు చేసుకున్న ఆస్పరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ హనుమంతప్ప, పోలీసులు లక్ష్మన్న, అగస్టీన్, ఆంజనేయులు, మల్లికార్జున, గోవర్ధనసింగ్ ఆగస్టు 5న కేసుకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నేరం అంగీకరించడంతో అరెస్టు చేసి అప్పటి పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో రిమాండ్‌కు పంపారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించినందుకు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, సీఐలు హనుమంతప్ప, మస్తాన్‌వలితోపాటు ఆస్పరి పోలీసులను డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందిస్తూ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సమక్షంలో అవార్డు అందజేశారు.
డీజీపి నుంచి ప్రశంసాపత్రం
అందుకున్న ఎస్పీ బిందు మాధవ్
Comments
Please login to add a commentAdd a comment