బిల్లు చెల్లింపు మరింత సులభం | - | Sakshi
Sakshi News home page

బిల్లు చెల్లింపు మరింత సులభం

Published Thu, Dec 19 2024 8:35 AM | Last Updated on Thu, Dec 19 2024 8:35 AM

బిల్ల

బిల్లు చెల్లింపు మరింత సులభం

కర్నూలు న్యూసిటీ: ఏపీఎస్పీడీసీఎల్‌ డిస్కం.. విద్యుత్‌ వినియోగదారులకు బిల్లుల చెల్లింపును సులభతరం చేయనుంది. వినియోగదారుల కోసం కరెంట్‌ బిల్లుపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక డిజిటల్‌ విధానాన్ని రూపొందించింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత డిసెంబరు నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు.

కొన్ని నెలలుగా ఆగిన యూపీఐ సేవలు

ఈ ఏడాది జూన్‌ వరకు యూపీఐ సర్వీస్‌ ప్రొవైడర్లుగా ఉన్న గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ తదితర మార్గాల ద్వారా కరెంట్‌ బిల్లులు చెల్లించడానికి వెసులుబాటు ఉండేది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలతో విద్యుత్‌ సంస్థలు ఆ ప్లాట్‌ఫారాల సేవలు నిలిపివేశాయి. ఈ పద్ధతి అమలులో ఉన్నప్పుడు విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి వినియోగదారులకు సులువుగా ఉండేది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో యూపీఐ సర్వీస్‌ ప్రొవైడర్ల సేవలు దూరమయ్యాయి.

జాప్యం, చార్జీల కారణాలతో..

యూపీఐ సర్వీస్‌ ప్రొవైడర్లుగా ఉన్న సంస్థలకు వినియోగదారులు చెల్లించే నగదు వెళ్లేది. అక్కడి నుంచి ఏపీ డీసీఎల్‌ ఖాతాలకు రీ–డైరెక్ట్‌ చేసేవారు. అయితే ఆ సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి సకాలంలో ఏపీఎస్పీడీసీఎల్‌ ఖాతాలకు జమ కాలేదు. దీనివల్ల ఏపీఎస్పీడీసీఎల్‌ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాకుండా యూపీఐ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఏపీఎస్పీడీసీఎల్‌ వల్ల ఎక్కువ ఆదాయం కూడా ఉండేది. ఉదాహరణకు విద్యుత్‌ వినియోగదారుడు యూపీఐ సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా బిల్లు చెల్లిస్తే అందులో ఓ కనెక్షన్‌కు రూ.2.50 కమీషన్‌ ప్రొవైడర్లకు దక్కేది. మిగతా మొత్తం ఏపీఎస్పీడీసీఎల్‌ సంస్థకు అందేది. ఇందులో కూడా జాప్యం చేస్తున్న కారణంగానే ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రెండు కారణాల వల్లే యూపీఐ సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా బిల్లులు చెల్లించే పద్ధతిని రద్దు చేశారు.

కౌంటర్ల పెంపుతో ఊరట..

ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ బిల్లులను పాత పద్ధతిలోనే మీసేవ కేంద్రాలు, ఏపీఎస్పీడీసీఎల్‌ సబ్‌ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా విద్యుత్‌ బిల్లుల వసూలుకు కౌంటర్లను పెంచారు. కౌంటర్ల పెంపు కాస్త ఊరట ఇచ్చినప్పటికీ సబ్‌ స్టేషన్‌ వద్ద బిల్లులు చెల్లించడానికి బారులుతీరాల్సి వస్తుంది. ఇక్కడ అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ మీసేవ కేంద్రాల వద్ద మాత్రం సర్వీస్‌ చార్జ్‌ రూ.5 చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లాలో విద్యుత్‌ సర్వీసులు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గృహ అవసర విద్యుత్‌ కనెక్షన్లు 11.56 లక్షలు ఉన్నాయి. వాణిజ్య కనెక్షన్లు 1,32,223, చిన్న, మధ్య, పెద్ద పరిశ్రమల విద్యుత్‌ సర్వీసులు 7,867, పపబ్లిక్‌ సర్వీస్‌ కనెక్షన్లు 24,129, హెచ్‌టీ కనెక్షన్లు 719 ఉన్నాయి. అలాగే జిల్లా ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు కేవీఆర్‌ కళాశాలకు ఎదురుగా ఉన్న ఆపరేషన్స్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయం వద్ద అధిక సంఖ్యలో కౌంటర్లు ఉన్నాయి. వీటితోపాటు విద్యుత్‌ భవన్‌ వద్ద బీరోడ్‌, పాత నగరం, బీక్యాంపు, వవెంకటరమణ కాలనీ సబ్‌స్టేషన్ల ఏఈ కార్యాలయాల వద్ద విద్యుత్‌ వసూలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

వచ్చే నెలలో మన జిల్లాలో

క్యూఆర్‌ కోడ్‌ బిల్లులు ఇస్తారు

క్యూఆర్‌ కోడ్‌ విద్యుత్‌ బిల్లుల విధానాన్ని మొదటగా పైలట్‌ ప్రాజెక్టుగా తిరుపతి జిల్లాలో పరిశీలిస్తున్నారు. అక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించి విజయవంతం చేసేందుకు విద్యుత్‌ శాఖ ప్రయత్నిస్తోంది. అక్కడ విజయవంతమైతే జిల్లాలో క్యూఆర్‌ కోడ్‌ విద్యుత్‌ బిల్లులు వినియోగదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే నెల నుంచి జిల్లా వినియోగదారులకు క్యూఆర్‌ కోడ్‌ విద్యుత్‌ బిల్లు రావచ్చని భావిస్తున్నాం.

– ఉమాపతి, విద్యుత్‌ ఎస్‌ఈ

క్యూఆర్‌ కోడ్‌ విధానానికి

శ్రీకారం చుట్టిన విద్యుత్‌ శాఖ

పైలట్‌ ప్రాజెక్టుగా తిరుపతి

వచ్చే నెల నుంచి జిల్లాలో అమలు

తిరుపతిలో ప్రయోగాత్మకంగా క్యూఆర్‌ కోడ్‌ విధానం

విద్యుత్‌ బిల్లుల చెల్లింపు ప్రక్రియను సరళతరం చేయాలని ఏపీఎస్పీడీసీఎల్‌ నిర్ణయించింది. ఈక్రమంలో తిరుపతి నగరంలో ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల (డిసెంబర్‌) నుంచి జారీ చేసే కరెంట్‌ బిల్లుల పైభాగంలో క్యూఆర్‌ కోడ్‌ ముద్రించనున్నారు. ఈ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా నగదు చెల్లింపులకు ఆస్కారం కల్పించనున్నారు. తిరుపతి ఫలితాలను సమీక్షించిన తర్వాత రాయలసీమ, నెల్లూరు, జిల్లాతోపాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో అమలు చేయనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలోకి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బిల్లు చెల్లింపు మరింత సులభం1
1/2

బిల్లు చెల్లింపు మరింత సులభం

బిల్లు చెల్లింపు మరింత సులభం2
2/2

బిల్లు చెల్లింపు మరింత సులభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement