వైద్య విజ్ఞాన బస్సు
కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వైద్య విజ్ఞాన బస్సును అందుబాటులో తెచ్చింది. ప్రతి నెల 26, 27 తేదీల్లో ఈ బస్సు కర్నూలు మెడికల్ కళాశాలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఈ ప్రత్యేక బస్సును గురువారం ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ హరిచరణ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బస్సులో బోధన, శస్త్రచికిత్సలపై అవగాహన కల్పిస్తారన్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన అంశాలపై ఆరోగ్య నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ బస్సు ఏర్పాటు చేశారని తెలిపారు. కేఎంసీ, ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో పీజీలు, వైద్య విద్యార్థులకు బస్సులో శిక్షణ ఇస్తారన్నారు. సాధారణ, ల్యాప్రోస్కోపిక్, గైనకాలజీ, యురాలజీ, పీడియాట్రిక్ శస్త్రచికిత్స వంటివి నేర్చుకోవచ్చని చెప్పారు.
సైబర్ నేరమా ...
1930కి ఫిర్యాదు చేయండి
● కర్నూలు రేంజ్
డాక్టర్ డీఐజీ కోయ ప్రవీణ్
కర్నూలు: ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ రాయలసీమ జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏ బ్యాంకు వారు కూడా ఓటీపీలు అడగరని, తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని హెచ్చరించారు. తెలియని లింకులు క్లిక్ చేయకూడదని, డిజిటల్ అరెస్ట్‌లు ఏవీ లేవన్నారు. అవన్ని సైబర్ నేరగాళ్లు చేసే మోసాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయనే మోస పూరిత మాటలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాల అధికంగా నమోదు అవుతున్నాయని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పింఛన్ల పంపిణీకి రూ.194 కోట్లు
● డిసెంబరు నెలతో
పోలిస్తే 1,007 పింఛన్‌లపై కోత
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్‌టీఆర్ పెన్షన్ కానుక కింద జనవరి నెలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 4,55,929 పింఛన్లకు రూ.194.65 కోట్లు మంజూరయ్యాయి. డిసెంబరు నెలతో పోలిస్తే జనవరి నెలలో 1,007 పింఛన్లపై కోత పడింది. కర్నూలు జిల్లాలో డిసెంబరులో 2,40,330 పింఛన్‌లు ఉండగా... జనవరిలో ఈ సంఖ్య 2,39,818కి తగ్గింది. వీటికి సంబంధించి రూ.102 కోట్లు, నంద్యాల జిల్లాలో డిసెంబరు నెలలో 2,16,606 పింఛన్లు ఉండగా... జనవరి నెలలో ఈ సంఖ్య 2,16,111కి తగ్గింది. వీటికి సంబంధించి రూ.91 కోట్లు ప్రకారం మొత్తం రూ.194 కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులను ఈ నెల 30న బ్యాంకులకు విడుదల చేయనుంది. అదే రోజున గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు నగదు డ్రా చేస్తారు. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు ఉన్నందున ఒక్కరోజు ముందే ఈనెల 31వ తేదీన పంపిణీ చేస్తారు. డిసెంబరు నెలలో పింఛన్లు తీసుకోని వారు జనవరి నెలతో కలిపి రెండు నెలల పింఛన్ తీసుకోవచ్చు. ఈ నెల 31న పింఛన్‌లు పొందలేని వారు జనవరి 2వ తేదీ పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment