ప్రజల పక్షాన ‘వైస్సార్‌సీపీ పోరుబాట’
● నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు,
డీఈలకు వినతిపత్రాలు
● కర్నూలులో భారీ నిరసన ర్యాలీ
● వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ
జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీలతో గత ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందిస్తామని చెప్పి మాట తప్పుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం రూ.15,485 కోట్ల పన్ను భారాలు మోపడం తగదన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆందోళనలో భాగంగా విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. కర్నూలు నగరంలో స్థానిక ఎస్టీబీసీ కళాశాల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి కేవీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయం (పవర్ హౌస్)లో డీఈలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వైఖరి మారే వరకు పోరాటం చేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడకుంటే ప్రజలను ఏకం చేసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళనలు చేపడుతున్నామని ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment