నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట

Published Fri, Dec 27 2024 2:06 AM | Last Updated on Fri, Dec 27 2024 2:07 AM

నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట

నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట

కర్నూలు న్యూసిటీ: గత ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాలతో అరకొరగా పెంచిన విద్యుత్‌ చార్జీలను భూతద్దంలో చూపిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై రూ.వేల కోట్ల భారం మోపారు. సంపద సృష్టి మాట అటుంచి ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేసే దిశగా బాబు విద్యుత్‌ చార్జీల పెంపు పిడుగును ప్రజల నెత్తిపై వేశారు. ఇప్పటికే పెంచిన చార్జీలను వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. గతంలో వచ్చిన బిల్లులను కూటమి ప్రభుత్వం ఇస్తున్న బిల్లులను చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. గతంలో రూ.300 బిల్లు వస్తే ఇప్పుడు దాదాపు రూ.375 వస్తోంది. 20 శాతం మేర బిల్లులు అధికంగా వస్తుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇస్తున్న విద్యుత్‌ బిల్లుల్లో ఎఫ్‌పీపీసీఏ చార్జీలు అని చేర్చారు. (ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జస్ట్‌మెంట్‌) ఇంధనం, విద్యుత్‌ కొనుగోలు ధరల సర్దుబాటు చార్జీలన్న మాట. ఈ పేరుతో ప్రభుత్వం ప్రజలపై అదనపు చార్జీల ముసుగు దెబ్బ వేసింది. గత ప్రభుత్వం ప్రజలకు విద్యుత్‌ బిల్లులు భారం కాకూడదనే లక్ష్యంతో ఇంధనం, విద్యుత్‌ కొనుగోలు చార్జీలను విధించకుండా బిల్లులు జారీ చేసేది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకే కాక పరిశ్రమల వినియోగదారులకు కూడా బిల్లులు చెల్లింపు పెద్ద కష్టంగా అనిపించేది కాదు. ఆరునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు గత ప్రభుత్వ హయాంలో మినహాయించిన చార్జీలను సైతం వసూలు చేస్తోంది. ప్రస్తుతం వస్తున్న బిల్లులో 2022–23 సంవత్సరానికి సంబంధించి కొనుగోలు చార్జీలు నిమిత్తం యూనిట్‌కు 58 పైసలు, తాజాగా 2024–25 సంవత్సరానికి సంబంధించి యూనిట్‌కు మరో 40 పైసలు అదనంగా వేస్తున్నారు.

జిల్లా ప్రజలపై నెలకు రూ.13 కోట్ల భారం

కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీల కారణంగా జిల్లా ప్రజలపై నెలకు రూ.13 కోట్ల మేర అదనంగా భారం పడుతుంది. జిల్లాలో మొత్తం విద్యుత్‌ సర్వీసులు 8,53,326 ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా ప్రజలపై నెలకు రూ.13.2 కోట్ల ప్రకారం ఏడాదికి రూ. 158.4 కోట్ల అదనపు భారం పడనుంది. వినియోగించిన విద్యుత్‌కు సంబంధం లేకుండా యూనిట్‌పై రూ.1 అదనంగా వసూలు చేస్తోంది. మామూలుగా ఇన్ని యూనిట్లకు ఓ రేట్‌..పెరిగితే మరో రేట్‌ అని శ్లాబ్‌ ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి మినహాయింపు లేదు. ఎన్ని యూనిట్లు కాల్చితే అన్ని యూనిట్లకు అదనంగా పెంచిన చార్జీలు చెల్లించాల్సిందే. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర భారమవుతుంది. తక్కువలో తక్కువ చూసినా ప్రస్తుతం రోజుల్లో సుమారు 200 యూనిట్లు విద్యుత్‌ వినియోగిస్తే శ్లాబు ప్రకారం బిల్లు ఎంత వచ్చినా... దానికి అదనంగా మరో రూ.200 చెల్లించాల్సి వస్తోంది. ఎగవేతదారులతో కలిగిన నష్టాన్ని సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి సర్కారు ముక్కు పిండి వసూలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మాట తప్పిన చంద్రబాబు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సాకులు చెబుతూ చార్జీల భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. గత నెల కరెంటు బిల్లుకు ఈ నెల కరెంటు బిల్లుకు వత్యాసం చూస్తే రూ.100 నుంచి 150 వరకు ఉంది. పేదల చాలా ఇబ్బంది పడుతున్నారు. పెంచిన చార్జీల నిర్ణయాన్ని రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఈరన్న, వినియోగదారుడు, ఆలూరు

విద్యుత్‌ చార్జీల బాదుడుపై శనివారం వైఎస్సార్‌సీపీ ప్రజలతో కలిసి సర్కారుపై పోరుబాట పట్టనుంది. ప్రతి నియోజక వర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలుపుకుని ఆందోళనలు నిర్వహించనుంది. దీంతో పాటు కర్నూలు విద్యుత్‌ భవనం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement