రహదారుల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
కోడుమూరు రూరల్: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయం ముందు రూ.2 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించారు. అధికారుల చేత కొలతలు వేయించడంతో పాటు, నాణ్యత ప్రమాణాల మేరకు వేశారా అని ఆరా తీశారు. సీసీ రోడ్ల పనుల్లో రాజీ పడకూడదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను పరిశీలించారు.అంతకుముందు కర్నూలు నుంచి కోడుమూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను కలెక్టర్ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రైతులు సాగు చేసిన పూలు, పండ్ల తోటలను కలెక్టర్ పరిశీలించారు. తోటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ వెంకటరమణయ్య, ఈఈ మద్దన్న తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment