కొండలు కరిగిపోతున్నాయ్!
ఆదోని రూరల్: ప్రకృతి సంపద కళ్ల ముందు తరలిపోతున్నా అడిగే నాథుడు లేడు. నిబంధనలకు విరుద్ధంగా దర్జాగా కొండ మట్టిని తరలిస్తున్నా చర్యలు తీసుకునే వారు కరువయ్యారు. రాజకీయ నేతల అండదండలతో కొందరు రియల్ వ్యాపారులు తమ అవసరాలకు కొండలను కరిగిస్తున్నారు. నూతన వెంచర్ల స్థలాన్ని చదును చేసి, రోడ్లు వేసేందుకు అవసరమైన మట్టిని యథేచ్ఛగా కొండల్లో నుంచి తరలిస్తున్నా అధికారులు అడ్డుకోలేక పోతున్నారు. ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొత్త వెంచర్ వేశాడు. అయితే పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతి తీసుకోకుండా గ్రామ సమీపంలో ఉన్న కొండల్లో గ్రావెల్ (గరుసు)ను హిటాచీతో తవ్వించి, నాలుగు ట్రాక్టర్లతో తరలిస్తున్నాడు. కొందరు గ్రామస్తులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ‘అధికారం మాది.. అధికారులు మా వాళ్లు.. మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి’.. అంటూ రియల్టర్ బెదిరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దొడ్డనగేరిలోనే గాకుండా ఆదోని మండలంలోని పెద్దతుంబలం, కుప్పగల్, ఇస్వీ, కడితోట, సంతెకూడ్లూరు, దిబ్బనకల్, సాదాపురం, ఢణాపురం, పెద్దహరివాణం, కపటి, బైచిగేరి, నెట్టేకల్ గ్రామాల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. రోజురోజుకు కొండలు కరిగిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఎత్తైన గుట్టలపై ఎవరో పేర్చినట్లు అందంగా కనిపించే కొండ రాళ్ల వరుసలు మాయమవుతున్నాయి. ఈ విషయంపై ఆదోని తహసీల్దార్ శివరాముడిని వివరణ కోరగా కొండ మట్టిని ఎవరైనా అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
యథేచ్ఛగా మట్టి తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు
దొడ్డన గేరి సమీపంలో కొండను తవ్వి ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment