గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ నగదు పంపిణీ చేస్తున్న వలంటీర్
ఆలూరు/రూరల్: ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందుకునే అవ్వాతాతలకు మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయి. ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ తూతూ మంత్రంగా సాగడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఇంటి వద్దనే పింఛన్లు అందుకున్నారు. ఠంచన్‌గా తెల్లవారు జాము నుంచే వలంటీర్లు ఇంటి తలుపు తట్టి పింఛన్ సొమ్ము చేతికిచ్చే వారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి అక్కడికే వెళ్లి నగదు అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ల పంపిణీ మారిపోయింది. వలంటీర్ల వ్యవస్థను ఎత్తేసింది. దీంతో పింఛన్ లబ్ధిదారులకు కష్టాలు తోడయ్యాయి. రాష్ట్ర ప్రభు త్వం సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫొటో ఫోజు కోసం కూటమి నాయకులు ఒకరిద్దరి ఇళ్ల వద్దకు వెళ్లి ఉద్యోగులతో పింఛన్ నగదు అందించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మమా అనిపిస్తున్నారు. అనంతరం రచ్చబండలు, ఆలయాల వద్దకు లబ్ధిదారులను పిలిపించి పింఛన్లు ఇస్తున్నారు. ఆలూరు మండలంలో 17 సచివాలయాల పరిధిలో 6,110 మంది లబ్ధిదారులు ఉన్నా రు. జనవరి నెల పింఛన్ల పంపిణీ ఇంటి వద్ద 20 శాతం కూడా లేదనే విమర్శలు ఉన్నాయి. చాలా సచివాలయాల పరిధిల్లో లబ్ధిదారులను ఒక చోటకు చేర్చి పంపిణీ చేశారు. దీంతో వృద్ధులు, వికలాంగులు అవస్థలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment