అతి వేగానికి ఇద్దరు బలి
కోడుమూరు రూరల్: కాసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన దంపతులను అతివేగం బలి తీసుకుంది. కోడుమూరు – కర్నూలు రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. కోడుమూరుకు చెందిన రామగోవిందు (56), వరలక్ష్మి(50)కి కుమార్తె, కుమారుడు ఉ న్నారు. రామగోవిందు బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో గత 20 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలిద్దరికీ వివాహాలు చేశారు. వరలక్ష్మికి అనారోగ్యంగా ఉండటంతో గురువారం హెల్త్ చెకప్ నిమిత్తం దంపతులు బైక్‌పై కర్నూలుకు వెళ్లారు. అక్కడ చెకప్ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న కుమార్తెకు ఫోన్ చేసి తిరిగి బయలుదేరుతున్నామని చెప్పారు. అయితే మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన వారిని మృత్యువు పొట్టన పెట్టుకుంది. మార్గమధ్యలో కొత్తూరు – ప్యాలకుర్తి గ్రామాల మధ్య ఎమ్మిగనూరు నుంచి నంద్యాల వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు రామగోవిందు, వరలక్ష్మి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. విషయం తెలుసుకున్న కోడుమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన దంపతులు విగతజీవులుగా తిరిగిరావడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment