హిప్నోథెరపీతో మానసిక ఒత్తిడి దూరం
కర్నూలు(హాస్పిటల్): హిప్నోథెరపీ ద్వారా వైద్య విద్యార్థులు తమ మానసిక ఒత్తిడి దూరం చేసుకోవచ్చని హిప్నోథెరపిస్టు డాక్టర్ సిరిగిరెడ్డి జయా రెడ్డి చెప్పారు. ప్రపంచ హిప్నోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలు మెడికల్ కాలేజిలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో వైద్య విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, పర్సనల్ సమస్యల వల్ల చదువు, సమస్యల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను ఎమోషనల్ ఇంటెలిజెంట్ ద్వారా తొలగించుకోవచ్చన్నారు. తద్వారా ఆత్మహత్యలను సైతం నివారించవచ్చన్నారు. హిప్నోథెరపీతో విద్యార్థులకు ఏకాగ్రత కుదురుతుందని, తద్వారా వారు చదువులో బాగా రాణిస్తారన్నారు. మోటివేషన్ క్లాసులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిసుధీర్, బయోకెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌తో పాటు హిప్నోథెరపీ కూడా విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు.
పీఎం అజయ్ కింద
వడ్డీ లేని రుణాలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి అను సుచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం అజయ్) పథకం కింద స్వయం సహాయక సంఘాల్లోని ఎస్సీ మహిళల జీవనోపాధులను అభివృద్ధి చేసేందుకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. డీఆర్‌డీఏ అమలు చేస్తున్న ఉన్నతి ద్వారా రుణాలు పంపిణీ చేస్తారు. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ ఇస్తుంది. ఉన్నతి ద్వారా పీఎం అజయ్ కింద రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ రుణాలకు వడ్డీ ఉండదు. రూ.లక్ష రుణం పొందితే 24 నెలలు, రూ.2 లక్షల వరకు రుణం తీసుకుంటే 36 నెలలు, రూ.3 లక్షల వరకు రుణం తీసుకుంటే 60 నెలల్లో చెల్లించాల్సి ఉంది. ఉన్నతి కింద తీసుకునే రుణాలను చెల్లించిన తర్వాత ఎస్సీ కార్పోరేషన్ సబ్సిడీ విడుదల చేస్తుంది. రూ.50 వేలకు మించకుండా సబ్సిడీ ఇస్తారు. ఈ రుణ సదుపాయంతో మహిళలు కిరాణం, చీరల వ్యాపారం, ఆటో, టెంట్‌హౌస్, చెప్పుల అంగడి, కంప్యూటర్ ఇంటర్నెట్ సెంటర్లు, కోళ్ల పెంపకం వంటి వాటిల్లో రాణించవచ్చు. జిల్లాకు 81 యూనిట్‌లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి అయిందని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
రెండో సెమిస్టర్ పరీక్షలకు 299 మంది గైర్హాజర్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన పరీక్షలకు 299 మంది ఛాత్రోపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 3,902 మందికి 3,602 మంది హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు అందజేయాలన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment