దివ్యాంగ పింఛన్లపై కుట్ర!
కర్నూలు(అగ్రికల్చర్): దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం పగ పట్టింది. రూ.6,000 పింఛన్ పొందుతున్న దివ్యాంగులందరూ మళ్లీ అర్హత పరీక్షకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. పింఛన్‌దారులైన దివ్యాంగులకు ఈ నెల 20 నుంచి నోటీసులు ఇవ్వడం, 23 నుంచి డాక్టర్ల ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో దివ్యాంగుల పింఛన్లను రూ.6,000కు పెంచుతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులపై అనర్హత అనే కొరడా ఝుళిపిస్తున్నారు.
ఇలా చేస్తారు...
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.6,000 ప్రకారం పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులు జనవరి నెలలో 56,645 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో అర్హత పరీక్షలు నిర్వహిస్తుండగా.. నంద్యాల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ నెల 21 నుంచి 23 వరకు అంధులు, బధిరులు (చెవిటి, మూగ) వారికి మాత్రమే వైద్య పరీక్షలు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో పింఛన్ పొందుతున్న దివ్యాంగులు 31,002 మంది ఉన్నారు. వీరందరూ మళ్లీ వైద్య పరీక్షలకు హాజరు కావాల్సిందే. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న దివ్యాంగుల్లో 85–90 శాతం మంది టీడీపీ హయాం నుంచి ఉన్నారు. 30 వేల దివ్యాంగుల్లో 10–15 శాతం వరకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పింఛన్ మంజూరైంది. పింఛన్ల భారాన్ని తగ్గుంచుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం అనర్హత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని ఏరియా హాస్పిటల్ తదితర ఆసుపత్రుల్లో కూడా దివ్యాంగులకు వైద్య పరీక్షలు (రీఅసెస్‌మెంటు) చేస్తారు. రోజుకు ఒక్కో ఆసుపత్రిలో 60 మంది దివ్యాంగులకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరు కాకపోతే అనర్హులుగా పరిగణించి పింఛన్ తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నంద్యాల జిల్లాలో..
నంద్యాల జిల్లాలో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారు 25,643 మంది ఉన్నారు. నంద్యాల జిల్లా ఆసుపత్రిలో రోజుకు 120 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు కంటి వైద్యులు, చెవి–ముక్కు–గొంతు వైద్యులతో రెండు టీములు ఏర్పాటు చేశారు. మంగళ, బుధ, గురువారాల్లో రోజుకు 120 మంది ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నోటీసులు జారీ చేయనున్నారు.
సర్వత్రా ఆందోళన
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త పింఛన్లు ఒక్కటీ ఇవ్వక పోగా.. పింఛన్లు తొలగిస్తూ లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. వీలైనంత ఎక్కువ దివ్యాంగులకు అనర్హత చూపాలని టీడీపీ నేతలు ఇప్పటికే సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెట్లకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అర్హత ఉన్నప్పటికీ అనర్హత వేటు వేసేందుకు ఇప్పటికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దివ్యాంగులకు 23 నుంచి
ఆసుపత్రుల్లో మళ్లీ వైద్య పరీక్షలు
అర్హత ఉన్నప్పటికీ
అనర్హత వేటు వేసే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment