ఊరి బడికి ఉరితాడు!
● 117 జీఓను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● రద్దుకానున్న యూపీ స్కూళ్లు ● ఉర్దూ పాఠశాలలపై స్పష్టత కరువు ● ఉపాధ్యాయ పోస్టులు తగ్గే అవకాశం ● నూతన జీవోపై నేడు సమావేశం
కర్నూలు సిటీ: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ హయాంలో తీసుకొచ్చిన జీఓ నంబరు 117ను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే టోఫెల్ విధానాన్ని అమలు చేయడం లేదు. సీబీఎస్‌ఈ బోర్డు స్కూళ్లు రద్దు చేయడంతోపాటు ఐబీ విద్యను అటకెక్కించింది. స్కూల్ కాంప్లెక్స్‌ల విధానాన్ని రద్దు చేసి నూతనంగా క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తున్నారు. కొత్త జీఓ తీసుకొచ్చేందుకు సన్నాహక సమావేశాన్ని శుక్రవారం కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఆర్జేడీ, డీఈఓలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్‌ఎంలు హాజరుకానున్నారు. నూతన విధానంతో ఉపాధ్యాయ పోస్టులు తగ్గడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలలు కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జీఓ 117 రద్దుతో ఇవీ కష్టాలు...
గ్రామాల్లో ఎప్పటి నుంచో స్పెషల్ స్కూల్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ పాఠశాలలు ఉన్నాయి. నూతన మార్గదర్శకాల ప్రకారం ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 60కిపైగా ఉంటే మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చనున్నారు. దీంతో రెండు పాఠశాలలు రద్దు అవుతాయి. అలాగే ఎప్పటి నుంచో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు సైతం వచ్చే ఏడాది నుంచి రద్దు కానున్నాయి.
● హైస్కూళ్లలో 75 మంది కంటే విద్యార్థులు తక్కువగా ఉంటే హెచ్‌ఎం, పీఈటీ పోస్టులు రద్దు కానున్నాయి. గతంలో 53 మందికి ఒక సెక్షన్, 54 నుంచి 88 మంది వరకు మరో సెక్షన్, 89 నుంచి 123 వరకు మూడో సెక్షన్ ఉంచి ఉపాధ్యాయులను నియమించారు. ప్రస్తుతం సెక్షన్లలో విద్యార్థుల సంఖ్యను పెంచనున్నారు. దీంతో జిల్లాలో హైస్కూళ్లలో వందలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది.
● కొత్తగా తీసుకొచ్చిన క్లస్టర్‌లో హెచ్‌ఎం స్థాయి విషయంలో స్పష్టత లేదు. ఒక క్లస్టర్ పరిధిలో రెండు, మూడు హైస్కూళ్లు ఉంటే వాటిలో పని చేస్తున్న హెచ్‌ఎంలకు సమాన స్థాయి ఉంటే క్లస్టర్ హెచ్‌ఎంతో ఏ మాత్రం పని చేస్తారనే విషయంపై స్పష్టత లేదు.
● 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలిపితే అక్కడ పని చేసే స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.
● ఇకపై డీడీఓలుగా క్లస్టర్ హెచ్‌ఎంలకే అప్పగించనున్నారు. అదే జరిగితే ఎంఆర్‌సీ వ్యవస్థ బలహీన మైపోతుంది. ఇక ఎంఈఓలు నామమాత్రంగా మారే అవకాశం ఉంది. గత ప్రభుత్వం పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలనే ఉద్దేశంతో ఒక్క మండలానికి ఇద్దరు ఎంఈఓలను నియమించారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఎంఈఓ–2 పోస్టులు ఉంటాయా? రద్దు అవుతాయా? అనే విషయంపై అయోమయం నెలకొంది.
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ అంటూ 2,645 టీచర్ పోస్టులను ప్రకటించారు. తాజాగా జీఓ 117 రద్దుతో డీఎస్సీలో ప్రకటించిన టీచర్ పోస్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కర్నూలు జిల్లాలో 96 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 6, 7, 8 తరగతుల్లో 60 మందికిపైగా ఉంటే హైస్కూళ్లుగా 42 అప్‌గ్రేడ్ అవుతాయి. 30 మందికి తక్కువగా ఉంటే స్కూల్స్ 32, అలాగే 30 నుంచి 60 విద్యార్థులు స్కూళ్లు 42 ఉండగా అవి ప్రాథమిక పాఠశాలలుగా మారనున్నాయి.
నంద్యాల జిల్లాలో 97 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 50 స్కూళ్లు హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ కానున్నాయి. 30 నుంచి 60 మంది విద్యార్థులు ఉండే పాఠశాలలు 28 ఉన్నాయి. 30 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు 19 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment